Sunday, December 22, 2024

కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారా?

- Advertisement -
- Advertisement -

వినూత్న పాలనా విధానాలతో సాధారణ ప్రజల జీవన వ్యయ భారాన్ని గణనీయంగా తగ్గించిన జనహిత వ్యూహాలతో చిరకాలంగా ఢిల్లీ రాష్ట్ర ప్రజానీకం ఆదరాభిమానాలను చూరగొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను, ఆయన పార్టీ ‘ఆప్’ ను రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీయాలని భారతీయ జనతా పార్టీ కక్ష కట్టినట్టు బోధపడుతున్నది. దేశ రాజధానిలో తన సింహాసనం కింద తనను ధిక్కరించే పార్టీ నిరవధికంగా అధికారంలో కొనసాగడాన్ని కేంద్ర పాలక పక్షం బొత్తిగా సహించలేకపోతున్నది. మద్యం కేసులో కేజ్రీవాల్‌కు ఇడి నోటీసులు ఇవ్వడం తమ పార్టీని అంతమొందించే కుట్రలో భాగమేనని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు.

ఈ కేసులో గత ఏప్రిల్‌లో ఒకసారి కేజ్రీవాల్‌కు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఇందులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా 8 మాసాలుగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. మరో ‘ఆప్’ నాయకుడు సంజయ్ సింగ్ ఇదే కేసుకు సంబంధించి కస్టడీలో వున్నారు. ఈ నెల 2న తన ఎదుట హాజరు కావలసిందిగా కోరుతూ ఇడి జారీ చేసిన నోటీసును కేజ్రీవాల్ ఖాతరు చేయలేదు. అది రాజకీయ దురుద్దేశంతో కూడుకొన్నదని, అందుచేత దానిని తాను పాటించదలచుకోలేదని ఆయన ప్రకటించారు. తన నోటీసును పట్టించుకోనందుకు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అధికారాలు ఇడి వున్నాయి. తనను ఏ క్షణాన అయినా అరెస్టు చేయవచ్చనే దృష్టితో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ తన పార్టీ ఎంఎల్‌ఎలందరినీ సోమవారం నాడు సమావేశపరిచారు.

‘ఆప్’ పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నట్టు ప్రజలు భావిస్తున్నారని ఎంఎల్‌ఎలు తెలియజేశారు. ఒక వేళ అరెస్టు చేస్తే జైల్లో నుంచే ప్రభుత్వాన్ని నడపాలని ఆయనకు వారు సూచించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసిన పనే లేదని స్పష్టం చేశారు. కోర్టుకు వెళ్ళి జైల్లోనే మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించడానికి అనుమతి తీసుకోవాలని కూడా సూచించారు. అనతి కాలంలోనే ‘ఆప్’ ఢిల్లీలో, పంజాబ్‌లో అఖండ మెజారిటీలతో అధికారాన్ని కైవసం చేసుకోడం బిజెపి పెద్దలకు మింగుడు పడకపోడం సహజం.

ఢిల్లీపై లెఫ్టినెంట్ గవర్నర్ నిరంకుశ పెత్తనం ఎంత మాత్రం చెల్లదని, ప్రజలెన్నుకొన్న ప్రభుత్వానికే సరాధికారాలు వుంటాయని, దాని మంత్రి వర్గం సిఫార్సుల మేరకే గవర్నర్ పని చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వగా దానిని అమలు కానీయకుండా ఆర్డినెన్స్‌ను తెచ్చి ఆ తర్వాత పార్లమెంటులో చట్టం కూడా చేయించిన ఘనత కేంద్ర పాలకులది. ఢిల్లీ రాష్ట్రాన్ని గతంలో కాంగ్రెస్, బిజెపిలు ఒక దాని తర్వాత ఒకటి పరిపాలిస్తూ వచ్చాయి. ఈ ఆనవాయితీకి కేజ్రీవాల్ 2013లో తెర దించారు. 2015 నుంచి ఇప్పటి వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి 2015 లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 70లో 67 నియోజకవర్గాలను ‘ఆప్’ గెలుచుకొన్నది. 2020 ఎన్నికల్లో 62 స్థానాలు కైవసం చేసుకొన్నది.

అలాగే పంజాబ్ ఎన్నికల్లో అసెంబ్లీలోని 117 స్థానాల్లో 92ను ‘ఆప్’ కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. ఢిల్లీ ప్రజలకు ముఖ్యావసరాలైన విద్యుత్తు, వైద్యం, విద్య వంటి వాటిని చవకగా అందుబాటులోకి తేవడం ద్వారా వారి ఆదరాభిమానాలను, మద్దతును చూరగొంటున్న కేజ్రీవాల్‌ను, ‘ఆప్’ను అణచివేయడానికి మద్యం కుంభకోణాన్ని కేంద్ర పాలకులు ఒక సాధనంగా చేసుకొన్నారని భావించవలసి వస్తున్నది. కేసును న్యాయస్థానానికి అప్పగించి ఒక కొలిక్కి తేవడానికి బదులు ఇడి, సిబిఐల వద్దనే దానిని వుంచి అదే పనిగా కక్ష సాధిస్తున్నారని బోధపడుతున్నది. ప్రధాని మోడీ ప్రభుత్వం తన ఆధీనంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులపై అక్రమంగా ప్రయోగిస్తున్న తీరు దేశ ప్రజలందరికీ తెలిసిందే. కక్షతో, ద్వేషంతో, చట్టాల దుర్వినియోగంతో నిరవధికంగా అధికారంలో కొనసాగాలని ఏ ఒక్క పార్టీ లేదా వ్యక్తి ప్రయత్నించినా అందులో విఫలం కాక తప్పదు.

బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అది అంతే తీవ్రంగా పైకి లేస్తుందనేది అనుభవ సత్యం. ఒకటి, రెండు మినహా ప్రతిపక్షాలన్నీ బిజెపి కక్ష సాధింపు రాజకీయాలకు తీవ్రంగా గాయపడినవే. అందుచేతనే అవి అన్నీ ఒక్క త్రాటి మీదికి వచ్చి ఉమ్మడి ఓటుతో రేపటి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని మట్టిగరిపించాలని వ్యూహ రచన చేసుకొన్నాయి. అందులో వాటి సాఫల్య, వైఫల్యాలు ఎలా వున్నప్పటికీ సాధారణ ప్రజానీకాన్ని అధిక ధరల మంటలకు బలి ఇస్తున్న చేదు వాస్తవం బిజెపిని వారి బోనులో నేరస్థగా నిలబెట్టడం ఖాయమని ప్రజాస్వామ్య ప్రియులు, సెక్యులర్ మేధావులు ఆశిస్తున్నారు. రాజ్యాంగ ప్రధాన లక్షమైన సెక్యులర్, సోషలిస్టు తరహా సమాజాన్ని నెలకొల్పి, తేడాలు లేకుండా అందరూ సమాన హక్కులతో శాంతియుత సహజీవనం సాగించేలా చేసే మహదాశయాన్ని బొత్తిగా అంగీకరించని బిజెపి దుర్మార్గాన్ని ప్రజలు ఇప్పటికైనా గ్రహిస్తారని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News