కరీంనగర్: జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని జెఎసి తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో పాటు.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా హాజరు అయ్యారు. డీలిమిటేషన్‌ను వ్యతిరేకించకపోతే.. చరిత్ర క్షమించదని కెటిఆర్ అన్నారు.
అయితే ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతోంది. ఈ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే కచ్చితంగా దక్షిణాది ప్రత్యేక దేశంగా కావాలనే డిమాండ్, తిరుగుబాటు తప్పదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ తరహాలోనే ఈ డిమాండ్‌ను కూడా తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. బిజెపిపై బిసి రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వంటి కత్తులు వేలాడుతున్నాయని.. ఆ రెండు సమర్థవంతంగా నిర్వహించకపోతే.. ముందుంది ముసళ్ల పండుగ అని కమలాకర్ హెచ్చరించారు.