తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయంపై ఉన్న మూడు టూంబ్స్‌ను కూల్చివేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గతంలో తాము టూంబ్స్‌ను కూల్చి వేస్తామని చెప్పిన మాటకు బరాబర్ కట్టుబడి ఉన్నామని, తప్పకుండా అధికారంలోకి రాగానే తప్పకుండా కూల్చి వేస్తామని తెలిపారు. గత ముఖ్యమంత్రి కెసిఆర్ జల్సా చేసే వ్యక్తి కాబట్టి పెద్ద పెద్ద గదులు తన కోసం కట్టించుకున్నారని, అయితే అధికారులు కూర్చునేందుకు మాత్రం చాలా ఇరుకు గదులు కట్టించారని విమర్శించారు. తాను తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర సచివాలయానికి వెళ్లానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉన్న 9 అంతస్తుల్లో మూడు అంతస్తులు టూంబ్స్ ఉన్నాయని, మెడ కాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవరైనా ఇలా కడతారా అని ఎద్దేవా చేశారు. సిబ్బంది కూర్చునేందుకు స్థలం లేదని, ప్రతి ఒక్కరూ తిట్టుకుంటూ పోతుంటారని అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ కేంద్ర మంత్రులను కలిసి సచివాలయంలో మాట్లాడింది లేదని తెలిపారు.
హోటల్ హరిత ప్లాజాలో బండి సంజయ్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని, ప్రజల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయమని అన్నారు. సీఎంతో అన్ని విషయాలూ చర్చించామని, వరద నష్టాన్ని అంచనా వేసి సాయం ప్రకటించడం జరుగుతుందని అన్నారు. నివేదికలను పరిశీలించిన అనంతరం ఏపి, తెలంగాణకు కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటిస్తుందని తెలిపారు. అలాగే ప్రస్తుతం కేంద్ర బృందాలు కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్నాయని, నష్టాన్ని అంచనా వేసిన తర్వాత నిధుల కేటాయింపు ఉంటుందని చెప్పారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే ఎన్డీఆర్‌ఎఫ్ నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలు సడలించాలని రేవంత్ కోరారని, ప్రస్తుతం రాష్ట్రం వద్ద రూ.1340 కోట్ల ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు ఉన్నాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుటుందని తెలిపారు. గత ప్రభుత్వం ఈ నిధులను వినియోగించుకోలేకపోయిందని, కానీ ఈసారి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటాయని, ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.