మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా…? లేక వాయిదా పడతాయా..? అని అభ్యర్థుల్లో కవలరం మొదలైంది. ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలను రీషెడ్యూలు చేయాలని టిఎస్‌పిఎస్‌సి, గ్రూప్ 2 గ్రూప్ 4ను కూడా రీ షెడ్యూల్ చేస్తుందా..? లేక అనుకున్న సమయానికి నిర్వహిస్తారా..? అని అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగితే ప్రస్తుతం సిద్ధమవుతున్న ప్రిపరేషన్ ప్రణాళికను కొనసాగించడం, ఒకవేళ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగితే ప్రిపరేషన్ ప్రణాళికలు ఎలా మార్పులు చేసుకునేలా మానసికంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టిఎస్‌పిఎస్‌సి ఇప్పటికే గ్రూప్ -2, గ్రూప్ 4 పరీక్షల తేదీలను ప్రకటించింది.గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన కమిషన్, జూన్ 11న మ మళ్లీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 1వ తేదీన గ్రూప్- 4, ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు జరగనున్నాయి. ఈ మూడింటినీ వరుసగా నిర్వహిస్తే.. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తుతాయా…? సిద్ధమయ్యేందుకు సమయం సరిపోతుందా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుని టిఎస్‌పిఎస్‌సి ఈ పరీక్షలపై నిర్ణయించే అవకాశం ఉంది.
ప్రైవేట్ ఉద్యోగుల్లో గందరగోళం
గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ వెలువడిన తర్వాత చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవులు పెట్టుకుని లేదా రాజీనామాలు చేసి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రిపరేషన్ కొనసాగించాలా…? లేక వద్దా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్లు ఎక్కువ కాలం సెలవులు పెడితే తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. జూన్, జులై, ఆగస్టు వరుసగా మూడు నెలల పాటు గ్రూప్ 1, గ్రూప్ 4, గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. అందులో గ్రూప్ 1 అభ్యర్థుల పరిస్థితి, వారి ప్రిపరేషన్ విధానం యుపిఎస్‌సి తరహాలో ఉంటుంది. అయితే గ్రూప్ 4, గ్రూప్ 2 అభ్యర్థుల ప్రిపరేషన్‌కు గ్రూప్ 1తో పోల్చితే కొంత వేరుగా ఉంటుంది.
గ్రూప్ 2, గ్రూప్ 4కు ప్రిపేరయ్యే అభ్యర్థులు పరీక్షలు పరీక్ష షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా..? లేక వాయిదా పడుతుందా..? అని, ఒకవేళ వాయిదా పడితే ప్రిపేరేషన్ ప్రణాళికను ఎలా మార్పు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాల నుంచి వచ్చి నగరంలో హాస్టళ్లు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి రూమ్‌లు తీసుకుని ఉంటూ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు పునరాలోచనలో పడ్డారు. హైదరాబాద్‌లో ఉంటూ పరీక్షలకు సిద్ధమవ్వాలంటే నెలకు అన్నీ కలిపి రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఖర్చు తప్పదని వారు ఆందోళన చెందుతున్నారు. కొందరు మహిళలు తమ కుటుంబాలను వదిలి గ్రూప్స్ లక్ష్యంతో నగరంలోని హాస్టళ్లలో ఉంటున్నారు. ఇలాంటి వారికి వారి కుటుంబాల నుంచి ఇళ్లకు రావాలని ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది.