కేంద్ర బడ్జెట్‌లో ఈసారైనా తెలంగాణకు న్యాయం జరిగేనా?
నాలుగేళ్లుగా కేంద్రానికి విన్నపాలు
ప్రాజెక్టులు ఇవ్వరు, నిధులు విదల్చరు
విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలు
మన తెలంగాణ /హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆర్ధిక వ్యవహారాల్లో రాష్ట్రాలకు అండగా ఉంటూ పెద్దన్న పాత్రను పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడమే కాకుండా సంవత్సరాల తరబడి ఎన్నో విన్నపాలు చేసినా కనికరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఆర్ధిక సహాయం చేయకపోయినా కనీసం న్యాయంగా ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులను కూడా మంజూరు చేయకుండా కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తుందనే విమర్శలున్నాయి. ఆర్ధిక సహాయం చేయమని అభ్యర్ధిస్తుంటే ఆ విషయాన్ని పక్కనబెట్టి బీజేపీ ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వంపై నిందారోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉందని అధికారవర్గాలు అంటున్నాయి. గడచిన నాలుగేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోయే రెండు నెలల ముందు నుంచే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను మంజూరు చేయాలని కోరుతూ ఎన్ని లేఖలు రాసినా కేంద్ర మంత్రులు పట్టించుకోవడంలేదని, తమ మంత్రులు రాసిన లేఖలకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల నుంచి కనీసం జవాబు కూడా రావడంలేదని, కేంద్రంలో ఇంతటి ఘోరమైన ప్రభుత్వం మునుపెన్నడూ లేదని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
2022-23వ ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సమావేశాల్లోనైనా తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందా? లేక? ప్రతి ఏటా జరుగుతున్నట్లుగా మొండిచెయ్యు చూపుతుందా? అనే చర్చ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో సఖ్యత, సయోధ్యతతో కేంద్ర ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్రం ప్రభుత్వ పెద్దలు మాత్రం బీజేపీయేతర రాష్ట్రాలపై సీతకన్ను వేసినట్లుగానే తెలంగాణను కూడా అన్ని విధాలుగా నిర్లక్షం చేస్తూనే వస్తోందని, మరి ఈ ఏడాదైనా కేంద్రం బడ్జెట్ ఎలా ఉంటుందోనని అధికారవర్గాలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి. తెలంగాణలో 11 రైల్వే ప్రాజెక్టులు కావాలని గడచిన ఏడు సంవత్సరాలుగా అభ్యర్ధిస్తూనే వస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత స్వపరిపాలనలోనూ ఏడేళ్ళుగా కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉన్నామని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.
పైగా తాము అడుగుతున్న రైల్వే లైన్ల మూలంగా కేంద్ర ప్రభుత్వానికే ఎంతో ఆదాయం వస్తుందని, పైగా తెలంగాణ ప్రజలు టిక్కెట్టు కొనుగోలు చేసిన తర్వాతనే ప్రయాణాలు చేస్తారని, అందుచేతనే రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తే కేంద్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టంరాదని అంటున్నారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు పెట్టే ఖర్చులను పెట్టుబడిగానే భావించాలని కూడా ప్రభుత్వం కేంద్రానికి విన్నవించిందని, అయినప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టడం దారుణమని అధికారవర్గాలు అంటున్నాయి. కనీసం ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోగానీ, రైల్వే బడ్జెట్‌లోనైనా తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని చూడాల్సి ఉందని అంటున్నారు.
తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరుతూ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్‌కుమార్ కేంద్రాన్ని కోరుతూ లేఖలు రాశారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన కానరాలేదు. మిషన్ భగీరధ పథకానికి ఆర్ధిక సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకొన్న నీతి ఆయోగ్ సంస్థ సిఫారసు చేసినప్పటికీ ఒక్క రూపాయిని కూడా తెలంగాణకు విడుదల చేయకపోవడం అన్యాయమని అంటున్నారు. నీతి ఆయోగ్ సిఫారసులను తుచ తప్పకుండా అమలు చేస్తామని హామీలు గుప్పించిన కేంద్రం పెద్దలు ఆచరణలో ఆ విషయాన్ని పక్కనబెట్టారని, లేకుంటే గడచిన నాలుగేళ్ళుగా ఎన్ని లేఖలు రాసినప్పటికీ మిషన్ భగీరథ పథకానికి ఏకంగా 19 వేల కోట్ల రూపాయల నిధులు తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయిని కూడా విడుదల చేయలేదని, ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోనైనా తెలంగాణపై కేంద్రం కనికరిస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
ఫార్మాసిటీ, ఇతర పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి 14 వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉందని, ఆ నిధులను కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. మిషన్ కాకతీయ పథకాన్ని దేశం యావత్తూ కొనియాడిందని, చివరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా మెచ్చుకొన్నారేగానీ ఆ పథకానికి ఇవ్వాల్సిన 5,205 కోట్ల రూపాయల నిధులను కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదు. నీతి ఆయోగ్ సిఫారసులను అమలు చేయాలని, ఆ మేరకు నిధులను విడుదల చేయాలని కోరుతూ ఆర్ధికశాఖామంత్రి టి.హరీష్‌రావు కేంద్రాన్ని కోరుతూ లేఖ కూడా రాశారు. మున్సిపాలిటీలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రవాణా రంగానికి 7,800 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉందని, ఆ నిధులను విడుదల చేయాలని మున్సిపల్ శాఖా మంత్రి కే.టి.ఆర్. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నాలుగు లేఖలు రాశారు. అంతేగాక చేనేత, టెక్స్‌టైల్స్ పరిశ్రమల కోసం 954 కోట్ల 96 లక్షల రూపాయల నిధులు రావాల్సి ఉందని, ఆ నిధులను విడుదల చేయాలని కూడా కే.టి.ఆర్. కేంద్రానికి లేఖ రాశారు.
కానీ ఈ లేఖపై కేంద్రం ఇప్పటి వరకూ స్పందించనే లేదు. స్పెషల్ గ్రాంట్ కింద 723 కోట్లు, రాష్ట్రం ఏర్పడిన కొత్త ఆంధ్రప్రదేశ్‌కు అవగాహనా రాహిత్యంతో మళ్ళించిన 495 కోట్ల 20 లక్షల రూపాయల నిధులను కూడా ఇవ్వకుండా కేంద్రం మొండికేయడం అన్యాయమని అధికారవర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. వీటికితోడు పెండింగ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ జీ.ఎస్.టి. నిధులు 210 కోట్లను కేంద్రం తెలంగాణాకు ఇవ్వాల్సి ఉండగా ఆ నిధులను కూడా ఇవ్వకుండా సతాయించడం అన్యాయం కాదా అని ఆర్ధికశాఖ వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. స్థానిక సంస్థలకు కూడా కేంద్రం నుంచి తెలంగాణకు 817 కోట్ల 61 లక్షల రూపాయల నిధులు రావాల్సి ఉందని, బీఆర్‌జీఎఫ్ బకాయిలు 900 కోట్లు ఉన్నాయని, అవి కూడా ఇప్పటి వరకూ విడుదల చేయకుండా కేంద్రం సతాయిస్తోందని ఆ అధికారులు వివరించారు. అనేక రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా కోట్లాది మంది గిరిజనులు హాజరయ్యే సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయహాదాను కల్పించాలని మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్రాన్ని కోరుతూ లేఖ రాశారు. ఈ జాతరకు ఇప్పటికే సుమారు 350 కోట్ల రూపాయల నిధులను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందని, జాతరకు ఆర్ధిక సహాయం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్రాన్ని కోరారు.
కానీ ఆమె లేఖపై కేంద్రం నుంచి ఉలుకు పలుకూ లేదని అధికారవర్గాలు వివరించాయి. ఇలా అన్ని ప్రాజెక్టులు, పథకాలు, బకాయిలు, జీఎస్టీ నిధులు, గ్రాంట్లు ఇలా ఎన్ని రంగాల్లో నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వాల్సి ఉందో. ఆ నిధులన్నింటినీ కేంద్రం నిలిపివేసింది. ఈ లెక్కన కేంద్రం అధికారికంగానే తెలంగాణకు రావాల్సిన 60 వేల 105 కోట్ల 77 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయకుండా సతాయిస్తోందని అధికారవర్గాలు వివరించాయి. ఐ.టి.ఐ.ఆర్. ప్రాజెక్టుతోపాటుగా ఇతర పెండింగ్ ప్రాజెక్టులను తెలంగాణకు మంజూరు చేయాలని కూడా మంత్రి కే.టి.ఆర్. దఫదఫాలుగా కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌లకు నాలుగు లేఖలు రాశారు. కానీ అవన్నీ బుట్టదాఖలయ్యాయా? లేక పరిశీలనలో ఉన్నాయో కూడా అర్ధం కావడంలేదని రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు అంటున్నారు. కనీసం రానున్న కేంద్ర బడ్జెట్‌లోనైనా తెలంగాణపై కనికరం చూపుతారా? లేదో? వేచిచూడాలని అధికారవర్గాలు అంటున్నాయి.