పిఓకె ఎన్నికల ర్యాలీలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హామీ
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకె)లో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.పిఓకెలో తమ పార్టీకి ప్రజామద్దతు బలహీనంగా ఉంటున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి నిత్యం ఏదో ఒక వాగ్దానం చేస్తున్నారు. కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్‌లో చేరాలనుకుంటున్నారా? లేక స్వతంత్ర దేశంగా ఉండాలనుకుంటున్నారా? అని తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం రాత్రి తెలిపారు. ఈ నెల 25న పిఓకె అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల్లో పిఓకెకు చెందిన దాదాపు 20 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 53 స్థానాలనుండి దాదాపు 700 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన శుక్రవారం తరార్ ఖాల్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో ఒక రాష్ట్రంగా చేయడానికితమ ప్రభుత్వం యోచిస్తోందంటూ ప్రతిపక్ష నాయకురాలు పిఎంఎల్‌ఎన్ పార్టీ నాయకురాలు మరియం నవాజ్ చేసిన ఆరోపణలను కొట్టివేశారు.
ఈ నెల 18న పిఓకెలో జరిగిన ఎన్నికల సభలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. అయితే పిఓకెను రాష్ట్రంగా చేయబోతున్నారంటూ పుకారు ఎలా పుట్టిందో తనకు అర్థం కావడం లేదని ఇమ్రాన్ అన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీలు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే రోజు వస్తుందని ఇమ్రాన్ అన్నారు.ఆ రోజు కశ్మీర్ ప్రజలు కూడా పాక్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐరాస తీర్మానం ప్రకారం రెఫరెండం నిర్వహించిన తర్వాత తమ ప్రభుత్వం కాశ్మీరీలు పాక్, భారత్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవడానికి మరో రెఫరెండం నిర్వహిస్తుందని చెప్పారు. జమ్మూ, కశ్మీర్‌లో భారత్‌లో అంతర్భాగమని, విడదీయలేనిదని భారత ప్రభుత్వం గతంలో అనేక సార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు కశ్మీర్‌కు సంబంధించిన సమస్యలు తమ అంతర్గత సమస్యలని, వాటిని పరిష్కరించుకునే సామర్థం తమకు ఉందని కూడా మన దేశం పాక్‌కు స్పష్టం చేసింది.
Will let Kashmiris decide if they want to join Pak