Friday, December 20, 2024

నీట్ రద్దు బిల్లును ఆమోదించే ప్రసక్తి లేదు: తమిళనాడు గవర్నర్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్(నీట్) వ్యతిరేక బిల్లును తాను ఆమోదించే ప్రసక్తి లేదని తమిళనాడు గవర్నర్ బిఎన్ రవి శనివారం స్పష్టం చేశారు. నీట్ లేకుండా భవిష్యత్తులో సాధించే అభివృద్ధి ఏదీ లేదని, నీట్ రాష్ట్రంలో కూడా శాశ్వతంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

నీట్‌ను రాష్ట్రంలో రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు తాను ఆమోదం తెలియచేయడం అసంభవమని, ఈ రాష్ట్ర పిల్లలు మేధోపరంగా తాము వెనుకబడి ఉన్నామని భావించడాన్ని తాను అంగీకరించబోనని రవి అన్నారు. ఈ రాష్ట్ర విద్యార్థులు ప్రతిభలో ఇతరులతో పోటీపడాలని, ఆ విషయంలో వారు ఇప్పటికే విజయం సాధించారని గవర్నర్ అన్నారు.

నీట్ యుజి 2023లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో గవర్నర్ శనివారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నీట్ రద్దు బిల్లును ఎప్పుడు ఆమోదిస్తారని ఒక విద్యార్థి తండ్రి వేసిన ప్రశ్నకు గవర్నర్ తీవ్రంగా స్పందించారు. తాను నీట్ రద్దు కోరుతూ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు సమ్మతి తెలియచేయలేదని, ప్రస్తుతం ఇది రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లినందున తుది నిర్ణయం రాష్ట్రపతి తీసుకుంటారని, తాను మాత్రం ఈ బిల్లును ఎన్నటికీ ఆమోదించే ప్రసక్తి లేదని గవర్నర్ చెప్పారు.

కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులే నీట్‌లో విజయం సాధించగలరన్న అపోహ ఏర్పడిందని, ఇది తప్పని గవర్నర్ అన్నారు. సిబిఎస్‌ఇ సిలబస్‌ను చదివిన వారికి నీట్‌లో ఉత్తీర్ణత సాధించడం కష్టమేమీ కాదని ఆయన తెలిపారు. ఈ దేశంలో నీట్ ఉంటుందని, ఈ రాష్ట్ర పిల్లలు ఇతరులతో పాటీపడగల ప్రతిభావంతులుగా ఎదగాలన్నదే తన లక్షమని ఆయన చెప్పారు.

గత ఏడాది తమిళనాడు ప్రభుత్వం నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు కోరుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించినప్పటికీ గవర్నర్ రవి దాన్ని తిరస్కరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి నివేదింంచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News