Saturday, November 23, 2024

ప్రవీణ్‌కుమార్ విఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

will not contest in Huzurabad by-poll:RS Praveen Kumar

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవీణ్‌కుమార్..?
సొంత ఎజెండాతోనే రాజకీయ ఆరంగేట్రం
కొంతకాలంగా తన సన్నిహితులతో రాజకీయాలపై చర్చ
పొలిటికల్ ఎంట్రీకి ఇదే సరైన సమయమని
భావించి స్వఛ్చంద పదవీ విరమణకు నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: గురుకులాల కార్యదర్శి, సీనియర్ ఐపిఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వఛ్చంద పదవీ విరమణ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్‌కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని రాజకీయ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ప్రవీణ్‌కుమార్ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తన సొంత ఎజెండాతోనే కాన్షీరాం తరహాలో రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే ఆ పార్టీ ఎజెండాతోనే పనిచేయాల్సి ఉంటుంది తప్ప తన సొంత ఎజెండాను అమలు చేయలేనని భావిస్తున్నట్లు సమాచారం. పూలే, అంబేద్కర్ అశయాలకు అనుగుణంగా కాన్షీరాం చూపిన మార్గంలో ముందుకుసాగుతానని ఆయన లేఖలో తన రాజకీయ ఆరంగేట్రం గురించి చెప్పకనే చెప్పారు. ప్రస్తుత రాజకీయాలను అధ్యయనం చేసి సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాల అభ్యన్నతి ఎజెండాతోనే ప్రవీణ్‌కుమార్ కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారనే ప్రచారం జరుగుతోంది.
సరైన సమయం కోసం వేచి చూస్తూ….
కొతకాలంగా ప్రవీణ్‌కుమార్ దేశ రాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తూ రాజకీయ ఆరంగేట్రం కోసం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారన్న ప్రచారం ఉంది. స్వేరోస్ సంస్థ ప్రతినిధులు, ఆయనను అభిమానించే వారు ప్రవీణ్‌కుమార్ రాజకీయాలలో రావాలని ఆయనకు చాలా సందర్భాలలో సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో దళితులకు రాజకీయ పార్టీ లేదని, ఆయన రాజకీయాలలోకి దళిత వర్గాలకు రాజకీయ అండ లభిస్తుందని చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై కొంతకాలం సీరియస్‌గా ఆలోచిస్తున్న ఆయన ఇటీవలి కాలంలో తన రాజీనామా, రాజకీయ ఆరంగేట్రంపై తన సన్నిహితులతో సీరియస్‌గా చర్చించినట్లు తెలిసింది. ఆయన రాజకీయాలలో రావడానికి ఇదే సరైన సమయమని తన సన్నిహితులు, శ్రేయోభిలాషులు సూచించినట్లు సమాచారం. సోమవారం మరోసారి తన సన్నితులతో సమావేశమైన ప్రవీణ్‌కుమార్ తాను స్వఛ్చంద పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు.
సొంత ముద్ర ఉండేలా పనిచేసిన ఐపిఎస్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అరకొర వసతుల మధ్య చదువుకుని ఐపిఎస్‌కు ఎంపికయ్యారు. పోలీసు అధికారిగా పనిచేసినా, గురుకులాల కార్యదర్శిగా విధులు నిర్వహించినా తన సొంత ముద్ర ఉండేలా వినూత్న కార్యక్రమాలతో చేపట్టి ప్రవీణ్‌కుమార్ ప్రజాదరణ పొందారు. పోలీసు అధికారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన ఎస్‌సిగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థానికంగా పనిచేస్తున్న గ్రామాల్లోనే ఉండాలని మా ఊరికి రండి.. మాతోనే ఉండండి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నినాదంపై ప్రవీణ్‌కుమార్ ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. అప్పుటికే నక్సలైట్ పార్టీలో పనిచేసిన సానుభూతిపరులను సైతం ‘మా ఊరికి రండి’ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. దీంతో ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కొంత ఆదరణ ఉంది. చాలాకాలం పాటు పోలీసు శాఖలో సేవలందించిన ఆయన తన మూలాలను మరిచిపోకుండా తాను చదువుకున్న సాంఘిక సంక్షేమ గురుకులాలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి పూనుకున్నారు. పేదల బిడ్డలు జ్ఞానవంతులు కావాలని సంకల్పించి పూర్తి అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారు. గురుకులాలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్ది పేద బిడ్డలు నీట్, జెఇఇ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు సాధించేలా చేశారు. విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా గురుకులాలలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టి, విద్యార్థులు త్వరగా జీవితంలో స్థిరపడేలా కృషి చేశారు. రాష్ట్ర సాంఘిక, గిరిజన గురుకులాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్ దళిత వర్గాలన్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చారనే ప్రచారం ఉంది. పేదలకు నాణ్యమైన కార్పోరేట్ విద్యను అందించేందుకు విశిష్ట సేవలందించిన ఆయన అనతికాలంలోనే అట్టడుగు వర్గాల ఆదరణ పొందారు. దళిత బిడ్డలు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా కృషి చేసిన ప్రవీణ్‌కుమార్ రాష్ట్రవ్యాప్తంగా ఆయా వర్గాల అభిమానం చూరగొన్నారు. అలాగే స్వేరోస్ సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టారు.
హుజురాబాద్‌లో పోటీ ఉద్దేశం లేదు: అర్ఎస్ ప్రవీణ్ కుమార్
తనకు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని, భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. కాన్షీరాం చూపిన బాటలో పయనిస్తూ పేద ప్రజలకు సేవచేసెందుకే తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. 26 ఏళ్ల సర్వీస్‌లో కేవలం 1శాతం ప్రజలకే సహాయం చేయగలిగానని అన్నారు. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే ఏం చెప్పలేనని చెప్పారు. స్వేరోస్ విద్యార్థులెవరూ అధైర్యపడొద్దని, గురుకులాలకు తన కంటే మంచి అధికారులు వస్తారని అన్నారు. కొంత విరామం తీసుకుని తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడించనున్నట్లు తెలిపారు.

will not contest in Huzurabad by-poll:RS Praveen Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News