Wednesday, January 22, 2025

ఉప్పుడు బియ్యం తీసుకోం

- Advertisement -
- Advertisement -

Will not purchase boiled rice: Central govt

లోక్‌సభలో కేంద్రం స్పష్టీకరణ

మనతెలంగాణ/హైదరాబాద్ : బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. బుధవారం నాడు ఎంపి దుష్యంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార , పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. స్థానిక అవసరాల రిత్యా ఆయా రాష్ట్రాలే బాయిల్డ్ రైస్ సేకరించుకోవాలని సూచించారు. ఇకపై దేశంలో ఎక్కడా బాయిల్డ్ రైస్ సేకరించబోమని గత ఖరీఫ్‌లోనే చెప్పామన్నారు. 202021 ఖరీఫ్ సీజన్‌లో 47.49లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పడు బియ్యాన్ని సేకరించామని వివరించారు. అంతే కాకుండా 6.33లక్షల మెట్రిక్ టన్నల ముడి బియ్యాన్ని కూడా సేకరించామని తెఇపారు. ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఒప్పందం మేరకు రాష్ట్రంలో ముడిబియ్యం సేకరిస్తామని వెల్లడించారు.

వరిరైతుల్లో మరింత మంటపుట్టించిన కేంద్రం :

తాజాగా బుధవారం నాడు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ లిఖితపూర్వక ప్రకటన ద్వార కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచి తెలంగాణ రాష్ట్ర వరిరైతుల సమస్యకు మరింత మంట రగిలించింది. యాసంగిలో నెలకొన్న తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితులను బట్టి ఇక్కడ రైతులు పండించిన ధాన్యం బాయిల్డ్ రైస్‌కు పనికి వస్తాయని , ముడిబియ్యానికి అంత అనుకూలంగా ఉండవని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలు మార్లు విడమర్చి చెప్పింది. ముఖ్యమత్రి కేసిఆర్ ఈ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వనుంచి మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖమంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రుల బృందం చర్చలు జరిపింది. కేంద్ర మంత్రి బాయిల్డ్ రైస్‌కోనుగోలు పట్ల వెనక్కుతగ్గకపోవటంతో రాష్ట్ర మంత్రుల బృందం చర్చలు ఫలవంతం కాలేదు. దీంతో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమాలకర్ , పువ్వాడ అజయ్‌లు ఊస్సూరుమంటూ ఢిల్లీనుంచి తిరిగివచ్చారు.కేంద్ర ప్రభుత్వ వైఖరీ, మంత్రి గోయల్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌కు వివరించారు. సిఎం అన్ని పరిస్థితులను సమీక్షించి ధాన్యం కొనుగోలు చేసేదాక కేంద్రాన్ని వదిలిపేట్టేది లేదన్న సంకేతాలను కేంద్రానికి పంపారు. అందుకు తగ్గట్టుగా ఉద్యమ కార్యాచరణను రూపొందించి ఆ దిశగా కేంద్రంపై వత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్ 2తర్వాత మరో మారు ఈ అంశంపై సమీక్షించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు.

కేంద్రం కొనకపోతే వరిరైతు ఆగమే:

తెలంగాణలో యాసంగి సీజన్ కింద పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోతే వరిరైతులు ఆగమాగం కానున్నారు. రాష్ట్రంలో 36లక్షల ఎకరాల్లో వరి సాగులో ఉంది. మరో వారం రోజుల్లో వరికోతలు ప్రారంభం కానున్నాయి. పంట చేతికొచ్చేదశలో ధాన్యం సేకరణపై పడ్డ పీటముడి వీడటం లేదు. యాసంగిలో సుమారు 70లక్షల మెట్రిక్ టన్నల ధాన్యం దిగుబడిని అంచనా వేశారు. అందులో కంపెనీలతో కుదర్చుకున్న ఒప్పదాలమేరకు విత్తన దిగుబడులు, మిల్లర్లు , వ్యాపారులతో కుదుర్చుకున్న అగ్రిమెట్లు , రాష్ట్ర అవసరాలకు వినిమోగం అయ్యే ధాన్యాన్ని అటుంచితే ,కనీసం 40లక్షల టన్నుల దాన్యం సేకరించక తప్పదంటున్నారు. కేంద్రం ప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా బాయిల్డ్ రైస్ సేకరణకు ముందుకు రాకపోతే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సివస్తుందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కనీస మద్ధతు ధరల కింద క్వింటాలుకు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960, సాధారణ రకానికి రూ.1940 ప్రకటించింది. కేంద్రం ధాన్యం కొనుగోలుకు సిద్దపడకపోతే మార్కెట్‌లో పోటీ ఉండదని, వ్యాపారులు కనీస మద్దతు ధరలు పెట్టి ధాన్యం కొనే పరిస్థితులు లేవంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News