తేలిచెప్పిన కెప్టెన్ అమరీందర్
చండీగఢ్ : అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నవ్‌జోత్ సింగ్ సిద్ధూను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పంజాబ్ సిఎం కానిచ్చేది లేదని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. ఇందు కోసం తాను సర్వశక్తులు సంతరించుకుంటానని, ఎటువంటి త్యాగానికి అయినా వెనుకాడేదిలేదని తేల్చిచెప్పారు. పంజాబ్‌నే కాకుండా మొత్తం దేశాన్ని ఈ ముప్పులమారి వ్యక్తి నుంచి రక్షించాల్సి ఉందన్నారు. తనకు ఎదురైన అవమానాలతో కలతచెంది పదవి నుంచి వైదొలిగినట్లు పేర్కొన్న అమరీందర్ వరుసగా మీడియాకు ఇంటర్వూలు ఇస్తూ వస్తున్నారు. తాత్కాలికంగానే చన్నీని సిఎం చేశారని, సిద్ధూనే ముఖ్యమంత్రి అవుతారని వార్తలు వెలువడుతున్న అంశంపై కెప్టెన్ స్పందించారు. సిద్ధూను సిఎం కానివ్వకుండా చూడటమే కాదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమికి గట్టి అభ్యర్థిని రంగంలోకి దింపుతానని ఈ ఇంటర్వ్యూలో అమరీందర్ చెప్పారు.
ఈ విధంగా తన రాజకీయ ఆలోచనలు తీవ్రస్థాయిలోనే ఉన్నాయని తెలియచేసుకున్నారు. సిద్ధూ డేంజరస్ అని స్పష్టం చేశారు. ఆయనకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆయనో ఉగ్రవాదే అని ఇటీవలే అమరీందర్ ఆరోపించిన విషయం తెలిసిందే. నాయకత్వ మార్పు దరిమిలా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారా? అని అడగగా, ఈ ఘట్టం అత్యంత కీలక స్థాయిలోనే ఉంటుందని, అయినా విజయం తరువాతనే వెనుదిరగడం ఉంటుందని, అపజయం తరువాత కాదని ఈ మాజీ కెప్టెన్ తెలిపారు. సిద్ధూ ఆటలు సాగనిచ్చేది లేదని , తాను సైనికుడినిని అని, దేశ వ్యతిరేకుల పనిపట్టడమే సైనికుడి పని అని ప్రకటించారు. తాను మూడు నెలల క్రితమే పదవికి రాజీనామా చేస్తానని పార్టీ అధినేత్రి సోనియాకు తెలిపానని, అయితే ఆమె నిరాకరిస్తూ పదవిలో ఉండాలని చెపుతూ వచ్చారని వివరించారు.
ఎక్కడైనా తాను సైనికుడి మాదిరిగానే వ్యవహరిస్తానని, విద్యుక్త ధర్మాన్ని పాటించడం తెలుసు, ఇఏ దశలో అవసరం అయితే దేశం కోసం ఏ విధంగా ఉండాలో తెలిసిన వాడినని చెప్పారు. పంజాబ్‌లో మరోసారి కాంగ్రెస్‌ను గెలిపించి తాను పదవి నుంచి వైదొలుగుతానని సోనియాజీకి చెప్పానని, అయితే ఇది జరగలేదని, ఇప్పుడు తాను పోరాడాల్సి ఉందన్నారు. తనకు గిమ్మిక్కులు చేయడం తెలియదని, నాయకత్వం వెళ్లిపోమంటే వైదొలగడం తెలుసునని, ఎమ్మెల్యేలను గోవాకు ఇతర స్థలాలకు తీసుకువెళ్లడం తెలియదని, అయితే తనకు తెలియకుండా ఎమ్మెల్యేలను ఇతర చోటికి రమ్మనడం ఇతరులకు తెలుసునని అమరీందర్ తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు సిద్ధూ నాయకత్వంలోనే జరుగుతాయని ఇటీవలే ఎఐసిసి నేత ఒకరు వ్యాఖ్యానించిన దశలో దీనికి సమాధానంగా అమరీందర్ స్పందించారు.