మోడీపై చిదంబరం విసుర్లు
న్యూఢిల్లీ: నాణ్యమైన, ఆరోగ్యకరమైన చర్చల కోసం చట్టసభలలో ప్రత్యేక సమయాన్ని కేటాయించే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రతిపాదనపై రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్లమెంట్‌లో జరిగే చర్చలలో ప్రధాని అసలు ఎప్పుడైనా పాల్గొంటారా అని ఆయన చురకలు అంటించారు. బుధవారం 82వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమావేశంలో వర్చువల్ పద్ధతిలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ శాసనకర్తలు భారతీయ విలువలను పాటించాలని, తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామన్న సందేశాన్ని ప్రజలకు అందచేయాలని పిలుపునివ్వడంతోపాటు ఇతరులపై విమర్శలపై గంభీరంగా, హుందాగా నాణ్యమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరిపేందుకు చట్టసభలలో ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తే బాగుంటుందని సూచించారు. దీనిపై చిదంబరం స్పందిస్తూ పార్లమెంట్‌లో నాణ్యమైన చర్చలు జరగాలంటూ ప్రధాని కోరడం ఆసక్తికరంగా ఉందని అన్నారు. అంతేగాక నాణ్యమైన చర్చల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని కూడా ప్రధాని సూచించారని, అయితే అసలు పార్లమెంట్‌లో ఎప్పుడైనా ప్రధాని చర్చలలో పాల్గొన్నారా అన్నదే తన ప్రశ్న అంటూ చిదంబరం వ్యాఖ్యానించారు.