Sunday, January 19, 2025

ప్రధాని మోడీ మణిపూర్ సందర్శిస్తారా? :ఉద్ధవ్ థాక్కరే

- Advertisement -
- Advertisement -

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని పరిస్థితిపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు చేసిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రాన్ని సందర్శిస్తారా అని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాక్కరే బుధవారం ప్రశ్నించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్కరే ముంబయిలో విలేకరుల గోష్ఠిలో ప్రసంగిస్తూ, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని మంజూరు చేసిన 370 అధికరణం రద్దు తరువాత అక్కడి పరిస్థితిలో ఏ మార్పు జరిగిందని కూడా అడిగారు. నిరుడు మేలో మణిపూర్‌లో మీటై, కుకి తెగల మధ్య దౌర్జన్య సంఘటనలు ప్రజ్వరిల్లాయి. అప్పటి నుంచి సుమారు 200 మంది హతులయ్యారు. పెద్ద ఎత్తున దహనకాండ చోటు చేసుకోగా ప్రభుత్వ భవనాలు, ఇళ్లు దగ్ధమయ్యాయి. వేలాది మంది నిర్వాసితులయ్యారు. కొన్ని రోజులుగా మణిపూర్‌లోని జిరిబమ్‌లో తిరిగి హింసాకాండ ప్రజ్వరిల్లుతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఏడాది తరువాత కూడా మణిపూర్‌లో శాంతి నెలకొనకపోవడంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితిని ప్రాధాన్య ప్రాతిపదికపై సరిదిద్దాలని ఆయన పిలుపు ఇచ్చారు. ‘మణిపూర్ దగ్ధం అవుతోందని మోహన్ భాగవత్ అన్నారు. ఆయన కనీసం ఒక ఏడాది తరువాత ఈ మాటచెప్పారు. ప్రధాని, హోమ్ శాఖ మంత్రి అక్కడికి వెళతారా?’ అని ఉద్ధవ్ అన్నారు. మణిపూర్, జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి గురించి ఉద్ధవ్ ప్రస్తావిస్తూ, మోడీ దానిని సరిదిద్దలేకపోతే, ఆయనకు మూడవ దఫా ప్రధానిగా ఉండే హక్కు లేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి కూడా ఉద్రిక్తంగానే ఉందని ఉద్ధవ్ చెప్పారు. ‘ప్రాణాలు పోతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర దాడులకు ఎవరు బాధ్యులు?’ అని ఆయన అన్నారు. ‘ఎన్‌డిఎ ప్రభుత్వం భవిష్యత్తు గురించి కాకుండా దేశం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాను’ అని ఉద్ధవ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News