న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ, ప్రత్యేకించి పేద, అణగారిన వర్గాలవారికి ఉచితంగా టీకాలు అందించే ప్రణాళిక ఏమైనా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నదా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన మరుసటిరోజు(ఆదివారం) కేంద్రానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌సూర్జేవాలా పలు ప్రశ్నలు సంధించారు. ఆహార భద్రత కింద సబ్సిడీలు పొందుతున్నవారు దేశ జనాభాలో 81.35 శాతం అనే అవగాహన కేంద్రానికి ఉన్నదా అని సూర్జేవాలా ప్రశ్నించారు. ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి, బిపిఎల్ వర్గాలవారందరికీ ఉచితంగా టీకాలు ఇస్తారా.? లేదా..? స్పష్టం చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాబాహుళ్యానికి చేపట్టే టీకాల కార్యక్రమాన్ని రాజకీయ ప్రచారం కోసం వినియోగించుకోకూడదని, ప్రజా సేవలో దానిని ఓ మైలురాయిగా భావించాలని సూర్జేవాలా హితవు పలికారు. బహిరంగ మార్కెట్‌లో వ్యాక్సిన్ల ధరలపై పారదర్శకంగా వ్యవహరించేలా కంపెనీలను ప్రభుత్వం డిమాండ్ చేయాలని ఆయన సూచించారు.