పునరుద్ఘాటించిన కుమారస్వామి
బెంగళూరు: జాతీయ స్థాయిలో ప్రజలు, రైతుల గొంతుగా మారుతానన్న టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు లక్ష్యానికి తమ పార్టీ సంపూర్ణ సహకారాన్ని అందచేస్తానని హామీ ఇచ్చినట్లు జెడిఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి సోమవారం తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో కెసిఆర్‌తో సమావేశమైన ఆయన సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ&ఇది తృతీయ ఫ్రంట్‌కు సంబంధించిన విషయం కాదని, దేశంలోని ప్రధాన సమస్యలకు పరిష్కారాలపై కెసిఆర్‌కు సొంత ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. తామిద్దరం నిన్న దాదాపు 3 గంటల పాటు ముఖాముఖీ చర్చలు జరిపామని, రైతాంగం కోసం, దేశంలోని ఏడు ప్రధాన నగరాల కోసం కెసిఆర్‌కు సొంత ప్రణాళిక ఉందని, దాన్ని జాతీయ స్థాయిలో ఎలా అమలు చేయాలో కూడా ఆయనకు సొంత ఆలోచణలు ఉన్నాయని కుమారస్వామి చెప్పారు.
ఈ లక్షసాధనకు జెడిఎస్ సహకారాన్ని కెసిఆర్ కోరారని ఆయన తెలిపారు. తమ మధ్య జరిగిన చర్చల ఆధారంగా ఒక చిన్న పార్టీగా తన సంపూర్ణ సహకారాన్ని అందచేస్తానని, దేశంలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ గొంతు వినిపించడానికి ఆయనతో చేతులు కలుపుతానని హామీ ఇచ్చానని కుమారస్వామి తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం సమకూర్చడానికి ప్రత్యామ్నాయ జాతీయ అజెండాపై ఏకాభిప్రాయం కోసం వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తానని కెసిఆర్ ఆదివారం ప్రకటించారు. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు కూడా కెసిఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు.