కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నంలో ప్రపంచం నిమగ్నమవుతున్నా ఇతర ప్రజారోగ్య ప్రాణాంతక సమస్యలపై అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదు. ముఖ్యంగా పాముకాటు ప్రాణాంతక సమస్యగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం మీద పాముకాట్లకు ఏటా 78,600 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిలో 64,100 మరణాలు భారత్ లోనే జరుగుతున్నాయని తాజా అధ్యయనంలో బయటపడింది. భారత్‌తోపాటు 21 దేశాలకు చెందిన
Researchers
ఈ అధ్యయనం నిర్వహించారు.
2008లో ప్రపంచం మొత్తం మీద పాముకాటు మరణాలపై అధ్యయనం జరగ్గా, మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధ్యయనం నిర్వహించడం గమనార్హం. ఇప్పటి అధ్యయనంలో ప్రపంచం మొత్తం మీద పాముకాటు మరణాల్లో 80 శాతం భారత్‌దే అని తేలింది. భారత్‌లో అన్ని రాష్ట్రాల కన్నా ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఏటా 16,000 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. తరువాత మధ్యప్రదేశ్‌లో 5790, రాజస్థాన్‌లో 5230 వరకు మరణాలు జరుగుతున్నాయి. దేశంలో ప్రతి లక్ష మందికి 4 నుంచి 8 శాతం వరకు పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయి.
ప్రపంచం మొత్తం మీద భారత్ లోనే పాముకాటు మరణాలు అత్యధికంగా ఉండడంతో ఈమరణాలను తగ్గించడంలో భారత్ కీలక పాత్ర వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఈమేరకు 2030 నాటికి చాలావరకు ప్రపంచ స్థాయి లోనే ఈ మరణాలు తగ్గించాలన్న లక్షం రూపొందింది. ఈ లక్ష సాధన కోసం ప్రపంచ దేశాల మధ్య సమన్వయం అవసరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ మరణాల నివారణకు కావలసిన వైద్య సౌకర్యాల కల్పనతోపాటు పరిశోధనలను ముమ్మరం చేయాలని చెబుతున్నారు. నిధులు సమకూర్చడానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని ఆశిస్తున్నారు. పాముకాటు మరణాలను తీవ్ర ప్రజారోగ్య సమస్యగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి గుర్తించింది.
ఈ మరణాల సంఖ్యపై జాతీయస్జాయిలో సర్వే చేపట్టింది. దీనివల్ల ఈ సమస్య భారం ఎంతవరకు ఉంటుందో తెలుసుకోడానికి సహాయపడినా , పాముకాటు సమస్యను పరిష్కరించడానికి నిర్ధిష్టమైన జాతీయ ప్రణాళిక కనిపించడం లేదు. పాముకాటు మరణాల నివారణే కాదు, ఆ కాటు ఫలితంగా ఏర్పడే అనర్థాలను నివారించే మార్గాల గురించి ప్రయత్నాలు జరగడం లేదు. విషసర్పాలు ఎందుకు ఏ పరిస్థితుల్లో కాటు వేస్తాయో వాటికి దూరంగా ఎలా ఉండాలో ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టడమే కాదు, పాములుమనుషులుపర్యావరణ సంఘర్షణ పై సామాజిక అవగాహన పెంపొందించడం తప్పనిసరి.
ఈ విష సర్పాల కాట్లను నిర్లక్ష ఉష్ణమండల వ్యాధి కేటగిరి ఎ గా 2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. ఏటా 4.5 మిలియన్ నుంచి 5.4 మిలియన్ మంది విషసర్పాలకు బలవుతున్నారని అంచనా వేసింది. వీరిలో 40 నుంచి 50 శాతం మంది తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని పేర్కొంది. పాముకాటు గాయం కారణంగా మరణాల సంఖ్య ఏటా 80 వేలు నుంచి 1,30, 000 వరకు పెరుగుతోందని వివరించింది.
ఏటా 50 లక్షలకు మించి పాము కాట్లు
ప్రపంచంలో విష సర్పాల కాట్లు ఏటా 50 లక్షలకు మించి ఉంటున్నాయి. ఈ కాట్లలో 20 లక్షలు విషపూరితమైనవి కాగా, 20 వేలు నుంచి 1,25,000 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. పాముకాటుకు గురైన వారిలో ప్రాథమికంగా భయం, వికారం, అతిసారం, వాంతులు, మూర్ఛ, గుండె వేగంగా కొట్టుకోవడం, జలుబు, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాముకోరల్లో వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి కాటుపడిన వ్యక్తులకు ధనుర్వాతాన్ని కలిగిస్తాయి. కండరాల కణాలు నశింప చేస్తాయి. నాగుపాములు , కట్లపాములు వ్యక్తి కళ్లల్లోకి విషం చిమ్ముతుండడం వల్ల కళ్ల కండరాల్లో పక్షవాతం ( ఆఫ్తాల్మోపరేసిస్ ) , చివరకు అంధత్వం కూడా సంక్రమించే ప్రమాదం ఏర్పడుతుంది. ఆస్ట్రేలియా లోని కొన్ని తెగల పాములు, రక్తపింజర, కట్ల పాములు, పగడాల పాములు, మాయసలక్కాయ, మచ్చల సలక్కాయ, పాములు పూర్తిగా విషపూరితమైనవే. వీటికాటుకు మూత్ర పిండాలు దెబ్బతింటాయి. శ్వాస సరిగ్గా ఉండదు. నాడీ వ్యవస్థ వైఫల్యం అవుతుంది.
విషం విరుగుడు (యాంటీ వీనమ్)
భారత్‌లో నాగు పాముల కాట్లకు కొన్నివేల మంది ప్రాణాలు కోల్పోతుండడాన్ని గమనించి 1895లో ఫ్రెంచి ఫిజీషియన్ ఆల్బెర్ట్‌కేల్మెట్టే పాముకాటు విషానికి విరుగుడు పద్ధతిని కనుగొన్నారు. అంతవరకు విషం విరుగుడు ప్రక్రియ ఎవరికీ తెలియరాలేదు. చిన్నపాటి విషాన్ని గుర్రం లేదా గొర్రెలో ఇంజెక్టు చేసి వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందనను ప్రేరేపించడం ద్వారా విషం విరుగుడు తయారు చేస్తారు. ఫలితంగా ఆ జంతువు రక్తంలోయాంటీబాడీలు ఏర్పడతాయి. యాంటీవీనమ్‌ను మనిషి రక్తనాళాల ద్వారా ఇంజెక్టు చేస్తారు. దీనివల్ల విషం ఎంజైమ్‌లు నిర్వీర్యమౌతాయి. అయితే విషం పాకిపోయి అప్పటికే అవయవాలు బాగా దెబ్బతింటే ఈ యాంటీవీనమ్ ఏమాత్రం పనిచేయదు. అందుకనే వీలైనంత త్వరగా యాంటీవీనమ్ పాముకాటు వ్యక్తికి అందితేనే ప్రమాదం నుంచి బయటపడగలుగుతాడు.
డాక్టర్- బి. రామకృష్ణ