కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచిన హామీలు, వాగ్దానాలు కలిసి వచ్చేనా! అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అధికారం చేపట్టేందుకు, బిజెపిని లోక్‌సభ ఎన్నికల్లో నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టిన హామీలు ఓటర్లు ఆదరించి ఆ పార్టీకి బాసటగా నిలుస్తారా.. ఎటు వైపు మొగ్గు చూపుతారు అన్న చర్చ రాజకీయ వేడిని పుట్టిస్తున్నది.కేంద్రంలో పదేళ్ళుగా అధికారంలో ఉన్న బిజెపి ఓటమికి కాంగ్రెస్ ప్రకటించిని ఐదు న్యాయ హామీలు విజయతీరం వైపు నడిపిస్తాయా! హామీలు ఏమేరకు ఫలితాలు ఇస్తాయన్న చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు న్యాయాల పట్ల ఒకింత ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నప్పటికీ భౌతికంగా ఓటు రూపేణ ఆ పార్టీ మలుచుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి.
‘ఇండియా’ కూటమిలో అనేక రాజకీయ పక్షాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పలు హామీలతో పాటు ‘యువ న్యాయం’, ‘నారీ న్యాయం’, ‘రైతు న్యాయం’, ‘శ్రామిక న్యాయం’, ‘సామాజిక న్యాయం’ వుంటి ఐదు గ్యారంటీలను ప్రకటించింది. సిపిఐ, సిపిఐ (ఎం), ఆర్‌జెడి, సమాజ్‌వాజ్ పార్టీ, డిఎంకె, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ, శివసేనా, నేషనల్‌లిస్టు కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా వంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీతో జతకట్టి లోక్‌సభ ఎన్నికలు 2024 పోటీ పడుతున్నాయి. ‘ఇండియా’ కూటమిలో ఉన్న పార్టీలు వేరువేరుగా ఎన్నికల ప్రణాళికను ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో పలు పార్టీలు పొత్తు పెట్టుకోగా, మరికొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో జతకట్టకుండా ఆయా పార్టీలు ఎన్నికల గోదాలో తలపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీల ప్రభావంచూపి విజయాన్ని ఏమేరకు అందిస్తాయన్న ప్రశ్నలు వెలుగు చూస్తున్నాయి. ‘ఇండియా’ కూటమిలోని భాగ్యస్వామ్య పక్షాలు ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను ఓటర్లు ఆదరిస్తారా! కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు గ్యారంటీలతో పాటు ఇతర హామీల వైపు మొగ్గు చూపుతారా అన్న అంశాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఒక్కసారి పరిశీలిద్దాం. ‘సమన్యాయం’ గ్యారంటీలో జనగణనతో పాటు ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన కులగణన, రిజర్వేషన్ హక్కు, రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు రిజర్వేషన్ 50% మించకూడదనే పరిమిత తొలగింపు ఎస్‌సి, ఎస్‌టిలకు ఉపప్రణాళిక, ఎస్‌సి, ఎస్‌టి వర్గాల జనాభా ప్రాతిపదికన వార్షిక బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు, జల్, జంగల్, జమీన్ కై చట్టపరమైన హక్కులు అమ లు, గిరిజన, ఆదివాసీ సమస్యల ను సత్వర పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది. ‘రైతు సమన్యాయం’లో స్వామినాథన్ కమిటీ సిఫారస్‌లను అనుసరించి పంటలకు మద్దతు ధర చట్టబద్ధ్దత, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ కోసం కృషి పంట నష్టం జరిగిన రైతులకు పంటల బీమా పథకం ద్వారా 30 రోజుల్లో పరిహారం.
రైతులకు లాభసాటి స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతులు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ భరోసానిచ్చింది. ‘కార్మిక న్యాయం’ ఆరోగ్య హక్కు చట్టం ద్వారా ప్రతి కార్మికునికి ఉచిత వైద్య పరీక్షలు, మందులు, ఆపరేషన్‌తో కూడిన ఆరోగ్య రక్షణ, కనీస వేతనం రోజుకు రూ. 400 చొప్పున జాతీయ ఉపాధి పథకం అమలు, పట్టణ ప్రాంతాల కార్మికులకు ఉపాధి చట్టం హామీ, అసంఘటిత కార్మికులకు జీవితభద్రత ప్రమాద బీమా వర్తింపు, కీలక ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు విధానం రద్దు చేస్తామని స్పష్టమైన హామీలను ఓటర్లు ముందు ఉంచింది. ‘యువ న్యాయం’ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 30 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్, విద్యావంతులైన యువకులకు నెలకు రూ. 8,500 చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు ఉపకార వేతనం, అన్ని ప్రవేశ పరీక్షల లీకేజీలను అరికట్టేందుకు కొత్త చట్టం, కార్మికులకు సామాజిక భద్రతతో కూడిన అనువైన పరిస్థితులు ఏర్పాటు, యువకిరణాల పేరిట రూ. 5 వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని మరో హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.
‘మహిళ న్యాయం’ పేరిట పేద మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లు, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, కార్మికుల వేతనాల పెంపు, ప్రతి గ్రామంలో మహిళల రక్షణ కోసం మహిళ అధికారిని నియమిస్తాం. ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు గృహవసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మరో గ్యారంటీని ఓటర్ల ముందు ఉంచింది. కాగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఐటిఐఆర్ ప్రాజెక్టు పునర్ ప్రారంభం,విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, హైదరాబాద్ ఐఐఎం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, దక్షిణ భారత దేశంలో నీతిఆయోగ్ కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు, నూతన ఎయిర్‌పోర్టులు, మణుగూరు, రామగుండం నూతన రైల్వే నిర్మాణం, నాలుగు సైనిక పాఠశాలల ఏర్పాటు, నవోదయ విద్యాలయ సంస్థల సంఖ్య పెంపు, జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు, నేషనల్ ఏవియేషన్ యూనివర్శిటీ ఏర్పాటు, 73, 74 రాజ్యాంగ సవరణ క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా పంచాయతీలకు బదిలీ చేయడం, ప్రతి ఇంటికీ సౌరశక్తి సరఫరా, హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు, హైదరాబాద్ బెంగళూరు కారిడార్, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రీయల్ కారిడార్, సింగరేణి కారిడార్ ఏర్పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక వినోద కేంద్రం ఏర్పాటు, మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని ప్రత్యేక హామీలను తెలంగాణ ప్రాంతానికి కురిపించింది. కాంగ్రెస్ పార్టీ హామీలు ఎంత వరకు ఫలిస్తాయన్న విషయం జూన్ 3న తేలనున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం తాము ఓటర్ల ముందు ఉంచిన హామీల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తారన్న విశ్వాసంతో ఉంది.
గుర్రం రాంమోహన్ రెడ్డి
7981018644