Monday, January 20, 2025

కోతలు ఎగవేతలేనా?

- Advertisement -
- Advertisement -

ఎన్నికల కోడ్ సాకు చూపి ఆరు గ్యారెంటీలు అమలు అటకెక్కిస్తారేమో !

దరఖాస్తుల పేరిట ఎన్నికల కోడ్ వచ్చే వరకు సాగదీసి కోడ్‌ను సాకుగా చూపి హామీలను అమలు చేయరనిపిస్తోందని
ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
గైడ్ లైన్స్ లేకుండా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది
మొదట గైడ్ లైన్స్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించాలి
ప్రభుత్వం అలా ఎందుకు చేయడం లేదు?
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ వచ్చేలోపే ఆరు గ్యారంటీల అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలి
గ్యారంటీలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి
ప్రభుత్వం తీరు చూస్తుంటే కోతలు,దాటవేత, ఎగవేత అన్నట్టుగా ఉంది
గ్యారంటీల అమలుకు సంబంధించి ఏం చేసినా ఫిబ్రవరి 20 లోపే చేయాలి
శ్వేతపత్రాలు కూడా హామీల ఎగవేత పత్రాలా? అనే అనుమానం కలుగుతోంది
ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది
పూర్తి స్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యమవుతుంది
నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీలు చెప్పారు
డిప్యూటీ సిఎం భట్టి తాము చెప్పలేదని అసెంబ్లీలో మాట మార్చారు
ప్రభుత్వ కార్యక్రమాల్లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు అవమానం జరుగుతోంది
బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రోటోకాల్ ఉల్లంఘించలేదు
విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, సిద్దిపేట ఎంఎల్‌ఎ టి.హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు.. వాటిపై తక్షణమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మార్చి 17తో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి వందరోజులు పూర్తవుతాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ లోపే ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. ఆరు గ్యారెంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది స్పష్టత లేదని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి హరీశ్‌రావు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ఫిబ్రవరి నెలాఖరులోపే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. దరఖాస్తుల పేరిట ఎన్నికల కోడ్ వరకు సాగదీసి కోడ్‌ను సాకుగా చూపి హామీలను అమలు చేయరనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. గైడ్ లైన్స్ లేకుండా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందని,నిజానికి మొదట గైడ్ లైన్స్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించాలని, ప్రభుత్వం అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యమవుతుందని చెప్పారు. ఎన్నికల కోడ్ పేరిట గ్యారంటీలకు కోతలు, ఎగవేత, దాటవేత జరుగుతుందా..? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని జీవోలు విడుదల చేస్తే కోడ్ వచ్చినా ఇబ్బంది ఉండదని సూచించారు. గ్యారంటీలకు సంబంధించి ఏం చేసినా ఫిబ్రవరి 20వ తేదీ లోపే చేయాలని అన్నారు.
శ్వేతపత్రాలు హామీల ఎగవేతల పత్రాలా?
శ్వేత పత్రాలు హామీల ఎగవేతల పత్రాలా..? అనే అనుమానం కలుగుతోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము అసెంబ్లీలో కూడాప్రస్తావించామని అన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యపడుతుందని, కానీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చిత్తశుద్ది ఉంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి దాటవేస్తారేమోనని అని చెప్పారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోతే ఆరు గ్యారంటీలకు కోతలు తప్పవని పేర్కొన్నారు. తాను జిల్లాల్లో పర్యటించినపుడు తమకు ఇంకా రైతుబంధు రాలేదని ప్రజలు చెబుతున్నారని చెప్పారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడితేనే గ్యారంటీలు సరిగ్గా అమలవుతాయని.. లేకపోతే అన్నింటికీ కోతలు తప్పవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే కోతలు, దాటవేత, ఎగవేతలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
యాసంగిలోనైనా ధాన్యానికి బోనస్ ఇవ్వాలి
యాసంగి పంటకూడా లోక్‌సభ ఎన్నికల సమయంలోనే వస్తున్నందున పంట బోనస్‌పై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని హరీశ్‌రావు అన్నారు. డిసెంబరు 9 నాడే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పింఛన్ల పెంపు, 200 యూనిట్లలోపు విద్యుత్ బకాయిల మాపీ అమలుచేస్తామని హామీ ఇచ్చినా.. ఇంకా అమలు కాలేదని మండిపడ్డారు. డిసెంబర్ 9 గడిచిపోయినా వాటి అమలు కాలేదని ప్రజలు ఆందోళనలో ఉన్నారని, దీనిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మరో కీలకమైన హామీ ఇచ్చిందని, ఈ ఖరీఫ్‌లో ఎలాగూ బోనస్ ఇవ్వలేదు…యాసంగి పంటకైనా బోనస్ ఇవ్వాలని కోరారు. యాసంగి పంట కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే వస్తుందని, పంటకు బోనస్‌పై ఇప్పుడు విధానపరమైన నిర్ణయం తీసుకోకపోతే యాసంగిలో రైతులు నష్టపోతారని అన్నారు. రైతులకు బోనస్ ఇవ్వడంపై ఇప్పుడే నిర్ణయం తీసుకుని జీఓ ఇవ్వాలని చెప్పారు.

రైతుబంధు డబ్బుల విడుదలపై తమ ప్రభుత్వం హయాంలో మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రతిరోజూ రైతుబంధు డబ్బులు ఎత్త పడ్డాయో ట్వీట్ చేసేవారని గుర్తు చేశారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు ఇచ్చిన వారికి రైతుబంధు డబ్బులపై ప్రతి రోజూ వివరాలు ఇవ్వడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇప్పటివరకు రైతుబంధు ఎంత వేశారో వైట్ పేపర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కరోనా కాలంలో కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని…అది తమకు రైతుల పట్ల ఉన్న కమిట్‌మెంట్ అని చెప్పారు. కరోనా సమయంలో ఎంఎల్‌ఎలు, ఉద్యోగుల జీతాలు తగ్గించి రైతులకు రైతుబంధు ఇచ్చామని గుర్తు చేశారు.
రూ.10లక్షల ఆరోగ్యశ్రీ ఎంత మందికి వర్తించిందో?
ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచామని ప్రభుత్వం చెబుతోందని, ఆ పెంపు ఎంత మందికి వర్తించిందో వివరాలు ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలోనే రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ అమలైందని చెప్పారు. అవయవమార్పిడి శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద తమ ప్రభుత్వం రూ.11.5 లక్షల వరకు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం చేయబోయే అప్పును సైతం మొన్నటి శ్వేతపత్రంలో చూపించారని విమర్శించారు. ఆర్‌బిఐకి రూ.13వేల కోట్ల అప్పు తీసుకోవడానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని వార్తల్లో చూశానని, డిసెంబర్‌లో రూ.1,400 కోట్ల అప్పు తెచ్చుకున్నారని తెలిసిందన్నారు. ఇప్పటివరకు ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పది లక్షల ఆరోగ్యశ్రీని పేదలు ప్రయోజనం పొందారో చెప్పాలని అడిగారు.
నిరుద్యోగ భృతిపై భట్టి మాట మార్చారు
నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీ చెప్పారని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాము చెప్పలేదని అసెంబ్లీ మాట మార్చారని.. ఇది ఎగవేతనే కదా అని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఖండన కూడా రాలేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ తేదీన ఏ నోటిఫికేషన్ ఇస్తారో తేదీల వారీగా పత్రికా ప్రకటనలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్లుగా ఫిబ్రవరి 1వ తేదీన జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని, లేకుండా యువతను మోసం చేసినట్టేనని పేర్కొన్నారు. జాబ్ కేలండర్ ప్రకటించిన వాళ్లు ఇప్పటి నుంచే మార్గదర్శకాలు రూపొందించుకోవాలని కదా..? అని ప్రశ్నించారు. గ్యారంటీలు ఇచ్చినప్పుడు బడ్జెట్ గురించి కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదా..? అని ప్రశ్నించారు. గ్యారంటీలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిందేనని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సిఎం స్థాయి వ్యక్తి వాహనాలను దాచిపెట్టారనడం సరికాదు
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాహనాలు దాచిపెట్టడం అని మాట్లాడటం సరికాదని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వాహనాలు దాచడం ఏం ఉంటుందని పేర్కొన్నారు. కెసిఆర్ కార్లను కొన్నది నిజం, బుల్లెట్ ప్రూఫ్(బిపి) కోసం ఇచ్చింది నిజమని.. ప్రభుత్వం కొంటే అది ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. కార్లకు బిపి చేసే మెకానిజం విజయవాడలోనే ఉందని, అక్కడ దాచారని చెప్పడం సిఎం స్థాయికి తగదని పేర్కొన్నారు. బుల్లెట్ ప్రూఫ్ కోసం వాహనాలను ఎవ్వరైనా విజయవాడకు పంపాల్సిందేనని, అందుకోసమే కొత్త వాహనాలను విజయవాడలో పెట్టినట్లు చెప్పారు. ఆ వాహనాలు ప్రభుత్వ ఆస్తి అని, వాటిని సిఎం వాడుకోరా..? ప్రభుత్వం వాడుకోదా..? అని ప్రశ్నించారు. ప్రతి భవన్‌లో ఎన్నో గదులు ఉన్నాయని, స్విమ్మింగ్ పూల్, సినిమా థియేటర్ ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అన్నారని.. ఇప్పుడు డిప్యూటీ సిఎం, మిగతా వారు ప్రగతి భవన్‌లో ఉంటున్నారని.. ఎన్ని గదులు ఉన్నాయో వారే చెప్పాలని అడిగారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు..
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్, జనగామ, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు గౌరవం ఇవ్వకుండా.. ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు అధికారులు ఆహ్వానాలు పంపారని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంఎల్‌ఎలకు అవమానం జరుగుతోందని ఆరోపించారు. 119 ఎంఎల్‌ఎలను సమాన దృష్టితో చూస్తామని అసెంబ్లీలో సిఎం చెప్పారని.. కానీ అలా జరగడం లేదని పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని, తాము ప్రొటోకాల్ పాటించి అన్ని పార్టీల ఎంఎల్‌ఎలను గౌరవించామని గుర్తు చేశారు. వివిధ కార్యక్రమాలలో బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్, కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు, ఎంఐఎంలు పాల్గొన్న విషయాన్ని ఉదహరించారు. పార్లమెంట్ ఎన్నికలకు తమ వ్యూహాలు తమకు ఉన్నాయని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కెసిఆర్ వాకర్ సాయంతో నడుస్తున్నారు
మాజీ సిఎం కెసిఆర్ ప్రస్తుతం వాకర్ సాయంతో నడుస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. సర్జరీ తర్వాత కెసిఆర్ కోలుకుంటున్నారని, జనవరి నెలాఖరు వరకు వాకర్ లేకుండా నడవగలుగతారని హరీశ్‌ రావు చెప్పారు.

Harish Rao 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News