Sunday, January 19, 2025

400 సీట్లు ఖాయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎ కూటమి 400 సీట్లకు పైగా లభిస్తాయని, బిజెపి క నీసం 370 సీట్లలో గెలుపొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ప్రసంగిస్తూ ఎన్నికల్లో పోటీ చేసే సత్తాను ప్రతిపక్ష పార్టీలు కోల్పోయాయని, సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష స్థానాలలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. జనం నాడిని తాను పసిగట్టగలనని, ఎన్‌డిఎకు 400కి పైగా సీట్లు, బిజెపి కి కనీసం 370 సీట్లు కచ్ఛితంగా లభిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మూ డవ పర్యాయం అధికారంలోకి వచ్చే రోజులు ఎం తో దూరం లేవని ఆయన అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను ప్రస్తావిస్తూ గరిష్ఠంగా 100 నుం చి 125 రోజులు మిగిలి ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మోడీ అబ్ కీ బార్(ఈసారి) అని గట్టిగా అనగా 400 పార్(400కి పైగా సీట్లు) అంటూ బిజెపి సభ్యులు ముక్తకంఠంతో నినదించారు. ఖర్గే కూడా ఇదే మాట అంటున్నారంటూ రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ మోడీ వ్యాఖ్యానించారు. ఎన్‌డిఎ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక భారీ నిర్ణయాలను చూస్తారని, వచ్చే 1000 సంవత్సరాలకు అవసరమైన శంకుస్థాపనలు జరుగుతాయని ప్రధాని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోడీ సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్రను పోషించే అవకాశం లభించినప్పటికీ కాంగ్రెస్ ఆ పాత్రలోనూ విఫలమైందని విమర్శించారు. తమ పార్లమెంటరీ స్థానాలను మార్చుకోవాలని కొందరు ప్రతిపక్ష నాయకులు భావిస్తుండగా రాజ్యసభకు వెళ్లాలని మరికొందరు ఆలోచిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్‌సభ నుంచి రాజ్యసభకు మారిపోయారని, వారసత్వ రాజకీయాలకు విసిగిపోయి గులాం నబీ ఆజాద్ ఏకంగా పార్టీయే మారిపోయారని మోడీ విమర్శించారు. ప్రతిపక్షం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నానని, చాలాకాలం పాటు ప్రతిపక్షంలో ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లు వారి ప్రసంగాలను బట్టి తాను, ఈ దేశం నిర్ణయానికి వచ్చామని ప్రధాని వ్యంగ్యంగా అన్నారు. ప్రతిపక్షాల ప్రస్తుత దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన నిందించారు. చాలా దశాబ్దాలు మీరు ఇక్కడ(అధికార పక్షంలో) కూర్చున్నారు. కాని అనేక దశాబ్దాలపాటు అక్కడే(ప్రతిపక్షంలో) ఉండాలని ఇప్పుడు మీరు నిర్ణయించుకున్నారు. ప్రజలు మిమల్ని దీవించి అక్కడే కూర్చోబెడతారు. మీరు మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటారు. త్వరలోనే పబ్లిక్ గ్యాలరీలో(సభలోపల విజటర్స్ గ్యాలరీ) మిమల్ని చూస్తాము అంటూ ప్రధాని ప్రతిపక్ష సభ్యులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొన్ని నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడానికి బడ్జెట్ సమావేశాలు మంచి అవకాశమని, కాని ప్రతిపక్ష సభ్యులు ఆ సదవకాశాన్ని కోల్పోయారని మోడీ అన్నారు. ప్రతిపక్షాల ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్‌దే పూర్తి బాధ్యతని ఆయన వ్యాఖ్యానించారు. మంచి ప్రతిపక్ష పాత్రను పోషించే చక్కని అవకాశం కాంగ్రెస్‌కు లభించింది. కాని ఆ పాత్రలో కూడా కాంగ్రెస్ విఫలమైంది. ఇతర పార్టీలకు పనిచేసే అవకాశాన్ని కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని విమర్శించారు.
పదేపదే ఒకే ప్రొడక్ట్‌ను లాంచ్ చేస్తున్నారు…
వారసత్వ రాజకీయాల దుష్ప్రభావాలను దేశంతోపాటు కాంగ్రెస్ కూడా అనుభవించిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో కూడా కొందరు యువ నాయకులు ఉన్నారు. ఒక వ్యక్తిని ఎక్కడ మించిపోతారో అన్న భయంతో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చెప్పే మొహబ్బత్ కీ దుకాణ్(ప్రేమ దుకాణం) నినాదాన్ని మోడీ ప్రస్తావిస్తూ ఒకే వస్తువును పదే పదే విడుదల చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దుకాణం త్వరలోనే మూతపడుతుందని ఆయన విమర్శించారు.దుకాణం అన్న పదం ప్రతిపక్షాలదని, బిజెపి విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ పదపదే మొహబ్బత్ కీ దుకాణ్ అన్న నినాదాన్ని దేశవ్యాప్తంగా ప్రస్తావిస్తున్నారని మోడీ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఆటోమొబైల్ మెకానిక్ పని కూడా నేర్చుకుందంటూ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని ఒక ఆటోమొబైల్ మెకానిక్ షాపును రాహుల్ గాంధీ ఇటీవల సందర్శించడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని చురకలు అంటించారు. కాంగ్రెస్ ఇటీవలే ఆటోమొబైల్ మెకానిక్ పని నేర్చుకుందని, అలైన్‌మెంట్ అంటే వారికి తెలుసని, కాని ప్రతిపక్ష కూటమి అలైన్‌మెంట్ మాత్రం సక్రమంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల సమయం. మీరు మరికొంత కష్టపడి ఉండాల్సింది. ఏదైనా కొత్త విషయాన్ని ప్రస్తావించి ప్రజలకు సందేశాన్ని పంపి ఉండాల్సింది. ఏదేమైనా మీరు ఘోరంగా విఫలమయ్యారు. ఈ విషయంలో మీకు పాఠాలు నేను నేర్పిస్తాను. ప్రతిపక్షాల ప్రస్తుత దుస్థితికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బాధ్యురాలు. మంచి ప్రతిపక్షంగా మారడానికి కాంగ్రెస్‌కు అవకాశం వచ్చింది. అయితే గత ఏడేళ్లలో ఆ బాధ్యతను నిర్వర్తించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది అంటూ మోడీ విమర్శించారు. వారసత్వ రాజకీయాలను మోడీ ప్రస్తావించినపుడు ప్రతిపక్ష సభ్యులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా పేర్లను ప్రస్తావించారు. దీనికి మోడీ సమాధానమిస్తూ రాజ్‌నాథ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ ఎమ్మెల్యే కాగా అమిత్ షా కుమారుడు బిసిసిఐ కార్యదర్శని చెప్పారు. ఒక కుటంబం పార్టీని నడిపి, తన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినపుడు దాన్ని వారసత్వ రాజకీయాలని అంటారని, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ పార్టీని నడపడం లేదని మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మతిభ్రమించినట్లు రద్దు సంస్కృతికి పాల్పడుతోందని, మేక్ ఇన్ ఇండియాను రద్దు చేస్తామని, స్థానికతను వ్యతిరేకిస్తుందని, వందే భారత్‌ను వద్దు అంటుందని, దేశం సాధించిన అభివృద్ధిని ఆ పార్టీ ఇంతలా ద్వేషించడం చూసి తనకే ఆశ్చర్యంగా ఉందని మోడీ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాన మంత్రులు, కాంగ్రెస్ సిద్ధాంతకర్తలు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై విమర్శనాస్త్రాఆలను సంధిస్తూ భారతీయుల శక్తిసామర్ధాలపై వారికి ఏమాత్రం నమ్మకం లేదంటూ వారి ఉపన్యాసాలలోని కొన్ని అంశాలను ప్రధాని మోడీ ఉటంకించారు. భారతదేశ శక్తి సామర్ధాలపై కాంగ్రెస్‌కు ఏనాడూ నమ్మకం లేదని, తమను తాము పాలకులుగా, ప్రజలను బానిసలుగా భావించేవారన్నారు.
అవినీతిపరులు లూటీ సొమ్ము కక్కాల్సిందే
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష పార్టీల నాయకులపై మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని లూటీ చేసిన వారు ఎవరైనా మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇందుకు తాజా ఉదాహరణ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ అంటూ వ్యాఖ్యానించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులను వదిలిపెట్టబోవని ఆయన చెప్పారు. పదేళ్ల క్రితం వరకు పార్లమెంట్‌లో కుంభకోణాలపై చర్చలు జరిగేవని, ప్రతిసారి చర్యల కోసం పార్లమెంట్ పట్టుపట్టేదని ఆయన గుర్తు చేశారు. కాని ఇప్పుడు అవినీతిపై చర్యలు తీసుకుంటే కొందరు వ్యతిరేకిస్తున్నారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రూ. 5,000 కోట్ల ఆస్తులను ఇడి జప్తు చేయగా తమ హయాంలో రూ. 1 లక్ష కోట్ల ఆస్తులను ఇడి స్వాధీనం చేసుకుందన్నారు. మీరు దోచుకున్న సొమ్మును వాపసు చేయాల్సిందేనని, దేశాన్ని మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రభుత్వంలో ఎంతమంది ఓబిసిలు ఉన్నారోనని కాంగ్రెస్ ఒకపక్క లెక్కపెట్టుకుంటూ అతిపెద్ద ఓబిసిని చూచలేకపోయానని తన గురించి చెప్పుకుంటూ మోడీ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News