Monday, September 9, 2024

కాంగ్రెస్‌తో మళ్లీ చేతులు కలిపేది లేదు: హెచ్‌డి కుమారస్వామి

- Advertisement -
- Advertisement -

కర్నాటకలో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చేందుకు బిజెపి, జెడి (ఎస్) నాయకులు, కార్యకర్తలతో కలసి పాటుపడతానని కేంద్ర మంత్రి, జెడి (ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి ఆదివారం ప్రకటించారు. తమ పార్టీ మరొక సారి కాంగ్రెస్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జెడి (ఎస్) ఇంతకు ముందు రెండు జాతీయ పార్టీలతో కలసి రెండు సార్లు అధికారంలో ఉన్నది. ఆ రెండు సార్లూ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జెడి (ఎస్) బిజెపితో చేతులు కలిపి ఎన్‌డిఎలో భాగమైంది. ‘కలసి పని చేయాలని బిజెపి, జెడి (ఎస్) కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది నాకు ప్రధానం కాదు. మీ ఆశీస్సులతో నేను రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను.

రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యం’ అని కుమారస్వామి చెప్పారు. ఎంయుడిఎ ‘కుంభకోణానికి’ నిరసనగా బెంగళూరు నుంచి మైసూరు వరకు వారంపాటు పాదయాత్రలో రెండవ రోజుకు ముందు బిజెపి, జెడి (ఎస్) కార్యకర్తలను ఉద్దేశించి కుమారస్వామి ప్రసంగిస్తూ, ‘బిజెపి, జెడి (ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న లక్షంతో మున్ముందు మీ కోసం పాటుపడతా’ అని హామీ ఇచ్చారు. ‘రాష్ట్రంలో ప్రజల అనుకూల ప్రభుత్వాన్ని తేవడానికే అంతిమంగా మన పోరు. ఆ ప్రభుత్వం ప్రతి కుటుంబం సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం కింద అటువంటి ప్రభుత్వాన్ని తేవాలని కోరుతున్నాం. అందుకోసం నేను. బివై విజయేంద్ర (బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు), రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కలసి పని చేస్తారు’ అని కుమారస్వామి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News