Sunday, January 19, 2025

పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చు పెడతారా…?

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టాలని చూస్తోందని, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటల వెనుక కుట్ర దాగి ఉందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్‌లోని స్టేట్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇష్టం లేదని, అందుకే వ్యవసాయానికి 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని మాట్లాడుతున్నారన్నారు.

మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తోందని, రైతాంగం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందన్నారు. ఉచితాలు వద్దని అంటున్న రేవంత్ పెన్షన్‌లు పెంచుతామని ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. మీ మాటలను బట్టి ఏది నిజం… ఏది అబద్దమో అర్ధం కావడం లేదన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల హాయాంలో సాగు నీరందక, విద్యుత్ లేక పంటలు ఎండిపోయి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

సాగు నీటి సమస్యలు పరిష్కరించేందుకు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించాలని, బోర్లు, బావులపై ఆధారపడి పంటలు సాగు చేసుకునే రైతన్నలకు నిరంతర విద్యుత్ అందించాలని 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. రైతాంగానికి 24 గంటల విద్యుత్ ఇవ్వవద్దని వారి మనసులో ఉన్నది కాబట్టే వారి నోటి నుంచి ఆ మాటలు వచ్చాయన్నారు. దీంతో కాంగ్రెస్ నేతల నిజ స్వరూపం బయటపడిందన్నారు.

రైతాంగానికి సాగునీరు, విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించక రైతులను ఆధోగతి పాలు చేశారన్నారు. పంటలకు నీళ్లు ఇవ్వకపోయినా నీటి తీరువా వసూలు చేశారని, పంటలు పండకపోయినా భూమి శిస్తు వసూలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సాగు నీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

రైతుల ఆర్థికాభివృద్ది కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలు తీసుకొచ్చి వ్యవసాయం దండగ కాదు… పండగ అని నిరూపించామన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో రైతాంగానికి రూ.4.50 లక్షల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేయలేదన్నారు. వరి పంట దిగుబడిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో రైతన్నలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారన్నారు.

టిడిపి హాయాంలో విద్యుత్ కోసం రైతన్నలు ఉద్యమిస్తే లాఠీలు ఝలిపించి అణిచివేశారని, వ్యవసాయం దండగ అంటూ రైతాంగాన్ని నిర్లక్షం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, రైతుల గురించి ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. ఇక బిజెపి ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తోందని, రైతన్నలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతోందన్నారు.

40 ఏళ్లు పాలించినప్పుడే ఏమి చేయలేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే అవి చేస్తాం… ఇవి చేస్తామంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమాన్ని జీర్ణించుకోలేక, ఇక తమ ఉనికి ప్రశ్నార్దకమవుతుందనే భయంలో ఏవేవో మాట్లాడుతున్నారన్నారు.

రైతన్నల జీవితాలతో ఆడుకుంటున్న దుర్మార్గపు కాంగ్రెస్, బిజెపి పార్టీలను బొంద పెట్టేందుకు రైతన్నలు నడుం బిగించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్‌పి చైర్‌పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జెడ్‌పిటిసిలు బాదినేని రాజేందర్, భూమయ్య, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ చైర్మన్ ఇందారపు రామన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News