నైరోబి: కెన్యా నూతన అధ్యక్షుడిగా విలియం రుటో మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆగస్టు 9న జరిగిన ఎన్నికల్లో ఆయన దీర్ఘకాలంగా ప్రతిపక్ష నేతగా ఉన్న రైలా ఒడింగాపై అత్యంత స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే అధికారిక ఫలితాలను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లను సుప్రీంకోర్టు గత వారం తోసిపుచ్చడంతో రుటో కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి అడ్డంకులు తొలగిపోయాయి.అధ్యక్ష పదవినుంచి వైదొలగుతున్న అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా ప్రభుత్వంలో రుటో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఒక దశలో కెన్యట్టాతో ఆయన తీవ్రంగా విభేధించడంతో వీరిద్దరూ చాలా నెలల పాటు మాట్లాడుకోలేదు కూడా. కాగా మంగళవారం రుటో ప్రమాణ స్వీకారం సందర్భంగా వీరిద్దరూ కరచాలనం చేసుకున్నప్పుడు పెద్ద సంఖ్యలో హాజరైన జనం పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. కాగా రుటో ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన నైరోబి స్టేడియంలోకి పెద్ద సంఖ్యలో జనం తోసుకుని రావడంతో ఒక ఫెన్సింగ్ విరిగి పడడంతో దాదాపు 60 మంది గాయపడ్డారు. అయితే క్షతగాత్రుల్లో ఎవరికీ పెద్ద గాయాలు తగలలేదని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. అయితే దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిన తరుణంలో రుటో అధ్యక్ష బాధ్యతలు చేపడుతుండడంతో ఎన్నికల ప్రచార సమయంలో చేసిన హామీలను నెరవేర్చడం ఆయనకు పెను భారం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా 2007లో జరిగిన ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండలో పాత్రధారులైన ఒక నేతనుంచి మరో నేతకు అధికార మార్పిడి జరుగుతుండడం గమనార్హం.ఈ హింసాకాండకు సంబంధించి కెన్యట్టా, రుటో ఇద్దరిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో అభియోగాలు నమోదయినప్పటికీ ఆ తర్వాత వారిపై కేసులను మూసివేశారు. అయితే ఈ సారి ఆగస్టులో జరిగిన ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా ముగియడం గమనార్హం.
William Ruto sworn as New President of Kenya