Saturday, November 23, 2024

తాలిబన్లతో కలిసి పని చేయడానికీ సిద్ధమే

- Advertisement -
- Advertisement -

willing to work with Taliban if necessary:Boris Johnson

కాబూల్ నుంచి మావాళ్లను వెనక్కి తేవడమే సవాల్
బ్రిటన్ ప్రధాని బోరిస్‌జాన్సన్

లండన్: తప్పనిసరైతే తాలిబన్లతో కలిసి పనిచేయడానికి సిద్ధమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కాబూల్ విమానాశ్రయం నుంచి బ్రిటీష్ జాతీయులు, తమ మద్దతుదారులను క్షేమంగా అక్కడి నుంచి తీసుకురావడమన్నదే ప్రస్తుతం తమ ముందున్న సవాల్ అని జాన్సన్ అన్నారు. అఫ్ఘన్‌లో తమ కార్యాచరణ ఇక ముగిసినట్టేనని ఆయన అన్నారు. ప్రస్తుతం కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద పరిస్థితి కాస్త మెరుగుపడిందని ఆయన తెలిపారు. గురువారం 1000 మంది, శుక్రవారం మరో 1000 మందిని తీసుకురావడానికి ఏర్పాట్లు జరిగాయని జాన్సన్ తెలిపారు. తాము వెనక్కి తీసుకొస్తున్నవారిలో బ్రిటీష్ జాతీయులతోపాటు అఫ్ఘన్‌లో తమకు సహకరించిన స్థానికులున్నారని జాన్సన్ తెలిపారు. కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి గత శనివారం నుంచి ఇప్పటివరకు(వారం రోజుల్లో) 1615మందిని తరలించినట్టు యుకె అధికారులు తెలిపారు. వీరిలో 399మంది బ్రిటీష్ జాతీయులు,320మంది దౌత్య సిబ్బంది, 402మంది తమ మద్దతుదారులైన అఫ్ఘన్లు ఉన్నట్టు వారు పేర్కొన్నారు.

తాలిబన్ల నుంచి ప్రమాదమని భావించి యుకె చేరుకున్న అఫ్ఘన్ శరణార్థులకు పునరావాసం కల్పించేదిశగా జాన్సన్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అందుకు 50 లక్షల పౌండ్లు ప్రకటించింది. ఇంగ్లాండ్,స్కాట్లాండ్,వేల్స్‌ల్లో వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అఫ్ఘనిస్థాన్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో బ్రిటన్ విదేశాంగమంత్రి డొమినిక్ రాబ్ సమర్థంగా వ్యవహరించలేకపోయారని ఆ దేశంలోని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాబ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, రాబ్‌ను సమర్థించేందుకు జాన్సన్ యత్నించారు. తన కేబినెట్ ఐక్యంగా ఉన్నదని, సమర్థంగా పని చేస్తున్నదని జాన్సన్ అన్నారు. కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి రెండురోజుల ముందు(ఆగస్టు 13న) బాధితుల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్ రిసీవ్ చేసుకోవడంలో యుకె విదేశాంగశాఖ విఫలమైనట్టు అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, పెద్దసంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నందున వాటిని మూల్యాంకనం చేసి తగిన సహాయం అందించడంలో కొన్ని ఇబ్బందులుండటం సహజమని జాన్సన్ సమర్థించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News