Saturday, November 23, 2024

వింబుల్డన్ క్వీన్ ఆష్లే బార్టీ

- Advertisement -
- Advertisement -

లండన్: ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తుది సమరంలో బార్టీ 63, 67(4/7), 63తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన 8వ సీడ్ కరోలినా ప్లిస్కోవాను ఓడించింది. బార్టీ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతకుముందు బార్టీ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఇక తాజాగా ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఫైనల్ సమరంలో బార్టీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అద్భుత షాట్లతో ప్లిస్కోవాను హడలెత్తించింది. బార్టీ ధాటికి ప్లిస్కోవా పూర్తిగా చేతులెత్తేసింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న బార్టీ సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్‌లో మాత్రం ప్లిస్కోవా అనూహ్యంగా పుంజుకుంది.
ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ఆటపై పట్టుబిగించింది. కళ్లు చెదిరే షాట్లతో బార్టీపై ఎదురుదాడికి దిగింది. బార్టీ కూడా సర్వం ఒడ్డడంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా తలపడడంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో ప్లిస్కోవా పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకుంది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో బార్టీ మళ్లీ పుంజుకుంది. తన మార్క్ ఆటతో ప్లిస్కోవాను ముప్పుతిప్పలు పెట్టింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్లిస్కోవాను కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఇదే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన ప్లిస్కోవా వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన బార్టీ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించింది. ఇదే క్రమంలో 1980 తర్వాత వింబుల్డన్ ఓపెన్ గెలిచిన తొలి ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారిణిగా బార్టీ రికార్డు సృష్టించింది. మరోవైపు కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని భావించిన చెక్ స్టార్ ప్లిస్కోవాకు నిరాశే మిగిలింది. చివరి వరకు బార్టీకి గట్టి పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ప్లిస్కోవా రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు.

Wimbledon 2021: Ashleigh Barty won Grand Slam title

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News