వింబుల్డన్‌లో పాల్గొనకుండా నిషేధం విధింపు!
లండన్: రష్యా, బెలారస్ టెన్నిస్ క్రీడాకారులకు ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ సంఘం షాక్ ఇచ్చింది. ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొనకుండా టోర్నీ నిర్వాహకులు నిషేధం విధించారు. దీంతో రష్యా, బెలారస్‌లకు చెందిన పలువురు అగ్రశ్రేణి టెన్నిస్ స్టార్లు వింబుల్డన్‌లో పాల్గొనడంపై సందేహం నెలకొంది. పురుషుల టెన్నిస్‌లో రష్యాకు చెందిన డానిల్ మెద్వెదేవ్, ఆండ్రీ రుబ్లేవ్, కచనోవ్ తదితరులు ప్రస్తుతం అగ్రశ్రేణి క్రీడాకారులుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. అంతేగాక మహిళల విభాగంలో అనస్థాసియా పావ్‌లచెంకోవా కూడా అగ్రశ్రేణి క్రీడాకారిణిల్లో ఒకటిగా పేరు తెచ్చుకొంది. వీరందరూ వింబుల్డన్ టోర్నీలో పాల్గొనకుండా నిర్వాహకులు ఆంక్షలు విధించారు. అంతేగాక బెలారస్ క్రీడాకారిణిలపై కూడా నిషేధం కొనసాగుతుందని టోర్నీ నిర్వాహకులు స్పష్టం చేశారు.
బెలారస్‌కు చెందిన అరినా సబలెంకా, విక్టోరియా అజరెంకా తదితరులు మహిళల టెన్నిస్‌లో అగ్రశ్రేణి క్రీడాకారులుగా పేరు తెచ్చుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ వింబుల్డన్ టోర్నీ నిర్వాహకులు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇదిలావుండగా ఇరు దేశాలకు చెందిన క్రీడాకారులు వ్యక్తిగతంగా టోర్నీలో ఆడొచ్చని నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే దేశం తరఫున ఆడేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. కాగా, రష్యా క్రీడాకారులపై నిషేధం విధించడాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్‌కోవ్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రపంచ టెన్నిస్‌లో రష్యా క్రీడాకారులు అగ్రస్థానంలో కొనసాగుతున్నారని, వీరిపై నిషేధం విధించడం సరికాదన్నారు. తమ క్రీడాకారులపై నిషేధం విధిస్తే టోర్నీనే ఇబ్బంది పడుతుందని హెచ్చరించారు.