Thursday, January 23, 2025

సెమీస్‌లో జాబేర్, సబలెంకా

- Advertisement -
- Advertisement -

లండన్: ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అరినా సబలెంకా (బెలారస్), ఆరో సీడ్ ఓన్స్ జాబేర్ (ట్యూనీషియా) సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్, రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించాడు. ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లేవ్ (రష్యా)పై జకోవిచ్ జయకేనతం ఎగుర వేశాడు.

ఇక మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్, మూడో సీడ్ ఎలినా రిబకినా (కజకిస్థాన్) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో జాబేర్ చేతిలో ఓటమి చవిచూసింది. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో జాబేర్ 67, 64, 61 తేడాతో రిబకినాను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా ఇటు జాబేర్ అటు రిబకినా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో తొలి సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన రిబకినా విజయాన్ని అందుకుంది. రెండో సెట్‌లో కూడా పోరు హోరాహోరీగానే సాగింది. ఆరంభంలో రిబకినా ఆధిపత్యం చెలాయించింది. దీంతో రిబకినా విజయం లాంఛనమే అనిపించింది. అయితే ఒత్తిడిలోనూ జాబేర్ అధైర్య పడలేదు.

ప్రత్యర్థి జోరును తట్టుకుంటూ ముందుకు సాగింది. అనూహ్యంగా పుంజుకున్న జాబేర్ సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక మూడో సెట్‌లో రిబకినా పూర్తిగా చేతులెత్తేసింది. జాబేర్ అసాధారణ ఆటతో రిబకినాను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ క్రమంలో అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. మరో క్వార్టర్ ఫైనల్లో అగ్రశ్రేణి క్రీడాకారిణి సబలెంకా విజయం సాధించింది. అమెరికాకు చెందిన 25వ సీడ్ మాడిసన్ కీస్‌తో జరిగిన పోరులో సబలెంకా 62, 64 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే సబలెంకా దూకుడును ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ తొలి సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్‌లో కీస్ కాస్త మెరుగైన ఆటను కనబరిచింది. అద్భుత షాట్లతో సబలెంకాకు గట్టి పోటీ ఇచ్చింది. కానీ కీలక దశలో మళ్లీ సబలెంకా పైచేయి సాధించింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

ఎదురులేని నొవాక్..
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుతం ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ జకోవిచ్ 46, 61, 64, 63 తేడాతో రష్యా ఆటగాడు రుబ్లేవ్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో రుబ్లేవ్ ఆధిపత్యం చెలాయించాడు. దూకుడుగా ఆడుతూ సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ ఆ తర్వాత జకోవిచ్ చెలరేగి పోయాడు. తమ మార్క్ ఆటతో రుబ్లేవ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ క్రమంలో వరుసగా మూడు సెట్లను గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News