Saturday, November 16, 2024

ఎవరు గెలిచినా చరిత్రే!

- Advertisement -
- Advertisement -

నేడు ఓన్స్‌తో రిబకినా తుది పోరు

లండన్ : ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. మూడో సీడ్ ఓన్స్ జాబేర్ (ట్యూనీషియా), 17వ సీడ్ ఎలినా రిబకినా (కజకిస్థాన్)ల మధ్య శనివారం ఫైనల్ పోరు జరుగనుంది. గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడడం ఇద్దరి కెరీర్‌లో ఇదే తొలిసారి. దీంతో ఫైనల్లో ఎవరు గెలిచినా చరిత్రే అవుతోంది. ఇక ఓన్స్ ఫైనల్‌కు చేరడం ద్వారా అరుదైన రికార్డును నెలకొల్పింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి అరబ్ క్రీడాకారిణిగా ఓన్స్ నిలిచింది. ఇక ఫైనల్లో గెలిస్తే మరో కొత్త నెలకొనడం ఖాయం. ఈసారి వింబుల్డన్‌లో ఓన్స్, రిబకినా అంచనాలకు మించి రాణించారు. వీరు ఫైనల్‌కు చేరుతారని ఎవరు ఊహించలేదు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ రిబకినా, ఓన్స్ తుది పోరుకు దూసుకొచ్చారు. ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఇద్దరు అసాధారణ ఆటను కనబరిచారు. రిబకినా ఈ టోర్నీలో అద్భుత ఆటను కనబరిచింది. ఫైనల్‌కు చేరుకునే క్రమంలో పెట్రా మాట్రిక్, అండ్రెస్కో, అజ్లా, సిమోనా హలెప్ వంటి స్టార్ క్రీడాకారిణిలను ఓడించింది. దీంతో ఫైనల్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక అగ్రశ్రేణి క్రీడాకారిణి ఓన్స్ కూడా తన స్థాయికి తగ్గ ఆటను కనబరిచింది. డియానె పారి, బౌజ్‌కొవా, ఎలిసె మెర్టెన్స్, మారియా తదితరులను ఓడించి ఓన్స్ ఫైనల్లో ప్రవేశించింది. ఇక తుది పోరులో కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉంది. కాగా, ఇటు రిబకినా అటు ఓన్స్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడంతో టైటిల్ ఎవరు సాధిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
నాదల్‌ను వెంటాడిన దురదృష్టం
స్పెయిన్‌బుల్ రఫెల్ నాదల్‌కు వింబుల్డన్ ఓపెన్‌లో దురదృష్టం వెంటాడింది. ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి జోరుమీదున్న నాదల్ వింబుల్డన్‌లోనూ సెమీస్‌కు చేరుకుని సత్తా చాటాడు. అయితే గాయం తిరగబడడంతో సెమీస్ బరిలోకి దిగకుండానే వింబుల్డన్ నుంచి నిష్క్రమించాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాడు కిర్గియాస్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక అమెరికా యువ ఆటగాడు ఫ్రిట్జ్‌తో జరిగిన హోరాహోరీ క్వార్టర్ ఫైనల్లో నాదల్ చిరస్మరణీయ విజయం సాధించాడు. అయితే గాయం తీవ్రం కావడంతో సెమీస్ ఆడకుండానే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈసారి వింబుల్డన్ టైటిల్‌ను సాధించాలని భావించిన నాదల్ ఆశలపై గాయం నీళ్లు చల్లింది.

నీల్‌క్రాజిక్ జంటకు మిక్స్‌డ్ టైటిల్

వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను డెసిరె క్రాజిక్ (అమెరికా)నీల్ స్కూప్‌స్కి (బ్రిటన్) జంట టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో ఈ జంట ఆస్టేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌సమంత స్టోసుర్ జోడీని ఓడించింది. ఆరంభం నుంచే రెండో సీడ్ నీల్ జోడీ ఆధిపత్యం చెలాయించింది. దూకుడైన ఆటతో ప్రత్యర్థి జంటను హడలెత్తించింది. వీరి ధాటికి ఆస్ట్రేలియా జంట ఎదురు నిలువలేక పోయింది. అద్భుత ఆటను కనబరిచిన రెండో సీడ్ నీల్ జోడీ 64, 63 తేడాతో విజయం సాధించి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News