Monday, November 18, 2024

నాగర్ కర్నూల్ లో గాలి వాన బీభత్సం… ఏడుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

వేరువేరు ఘటనలో ఏడుగురు దుర్మరణం
నిర్మాణంలో ఉన్న డైరీ షెడ్డు కూలి నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలో ఘటన
ఇద్దరి పరిస్థితి విషమం,మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
తెలకపల్లిలో పిడుగుపాటుకు గురై 12 ఏళ్ల బాలుడు మృతి
తుఫాన్ వాహనంపై రాయిపడి డ్రైవర్ మృతి

మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. వేరువేరు ఘటనల్లో మొత్తం ఏడు గురు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ శివారులో నిర్మాణంలో ఉన్న డైరీ షెడ్డు భారీ ఈదురుగాలులకు రేకులు ఎగిరిపడి గోడ కూలడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రానికి శివారు లో అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో బెల్లె మల్లేష్ అనే రైతు పొలంలో డైరీ షెడ్డును నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలో సాయంత్రం భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో గాలికి రేకులు ఎగిరి పడడంతో నిర్మాణంలో ఉన్న గోడ కూలింది వర్షం వస్తున్న తరుణంలో ఆ గోడ చాటుకు నిలబడి ఉన్న ఎనిమిది మందిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తాడూరు మండల కేంద్రానికి చెందిన షెడ్డు యజమాని రైతు బెల్లే మల్లేష్ (38) ఆయన కూతురు బెల్లె అనూష (10) పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన కూలీలు సల్వాజీ రాములు (35) అతని భార్య సల్వాజి చెన్నమ్మ (34) అక్కడికక్కడే మృతి చెందారు. బిల్లె రాజు (14) బెల్లే మల్లేష్ భార్య పార్వతమ్మ ,మెస్ట్రీలు చిన్న నాగులు, కురుమయ్య అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్న నాగులు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన దండు లక్ష్మణ్ 12 అనే బాలుడు మృతి చెందాడు. అదేవిధంగా నాగర్ కర్నూల్ శివారులోని మంతటి గడ్డ వద్ద ప్రధాన రహదారి పై శ్రీశైలం నుంచి వికారాబాద్ కు వెళ్తున్న తూఫాన్ వాహనంపై గాలివాన వస్తున్న క్రమంలో రేకులపై ఉన్న ఇటుకలు వాహనంపై పడి తీవ్రంగా గాయపడిన వికారాబాద్ జిల్లాకు చెందిన వేణు (38) అనే తుఫాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడి జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గo మధ్యలో మృతి చెందాడు. అదేవిధంగా చారగొండ మండలం నూకల చింత తండాలో పిడుగు పడటంతో జైపాల్ నాయక్ అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. వెల్దండ మండలం లో పిడుగుపాటుకు గురై ఆవు మృతి చెందింది.

బిజినపల్లి మండలం, నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన అంజన్ రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయ పొలం వద్ద పనులు చేసుకుంటుండగా భీకరమైన గాలి వాన రావడంతో వ్యవసాయ పొలంలోని మృతి చెందినట్లు తెలిసింది. ఇతనికి ఫిట్స్ వస్తాయని గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా గాలివాన బీభత్సంతో నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట కల్వకుర్తి కొల్లాపూర్ నాగర్ కర్నూల్ ప్రాంతాలలో భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి అనేక ఇళ్లకు సంబంధించి రేకులు పశువుల కొట్టాలు కొట్టుకుపోయాయి. సాయంత్రం 4:00 నుంచి విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా నష్టం వాటిల్లిందని అంచనా… ఇదిలా ఉండగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News