Monday, December 23, 2024

భారత అంతరిక్షయానానికి నలభై ఏళ్ళు

- Advertisement -
- Advertisement -

రత దేశ మొట్టమొదటి వ్యోమగామి, వింగ్ కమాండర్ రాకేష్ శర్మ, (విశ్రాంత) అంతరిక్షయానం చేసి 40 సంవత్సరాలు పూర్తయ్యింది. సెప్టెంబరు 20, 1982న భారత వైమానిక దళ పైలట్, స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), సోవియట్ యూనియన్ (రష్యా) ఇంటర్‌కాస్మోస్‌ల ఉమ్మడి అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా ‘వ్యోమగామి’ (Cosmonaut)గా ఎంపికై ఏప్రిల్ 3, 1984న, సోవియట్ రాకెట్ ‘సోయుజ్ టి-11’ అంతరిక్ష వాహక నౌక ద్వారా అంతరిక్షం చేరుకున్న తొలి భారతీయుడిగా, ప్రపంచంలో 128వ వ్యక్తిగా గుర్తింపు పొందగా, భారత దేశం ఒక వ్యక్తిని అంతరిక్షంలోకి పంపిన 14వ దేశంగా చరిత్ర సృష్టించింది. రాకేష్ శర్మతో పాటు ఇద్దరు సోవియట్ వ్యోమగాములు, కమాండర్ యూరీ మాలిషెవ్, ఫ్లైట్ ఇంజనీర్ గెన్నాడీ స్ట్రెకలోవ్ లు అంతరిక్ష కేంద్రం సల్యుట్ 7కి ప్రయాణించారు.

కాగా 12 ఏప్రిల్ 1961న సోవియట్ యూనియన్ పౌరుడు యూరీ గగారిన్ ‘వోస్టాక్’ అంతరిక్షనౌక ద్వారా అంతరిక్షయానం చేసిన మొట్టమొదటి మానవుడు. 108 నిమిషాలపాటు రోదసిలో ప్రయాణించిన అతను గంటకు 27,400 కిలోమీటర్ల వేగంతో భూమిని చుట్టుముట్టాడు. 13 జనవరి 1949న పాటియాలా, పంజాబ్‌లో జన్మించిన రాకేశ్ శర్మ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఎ)లో శిక్షణ పూర్తయిన తరువాత 1970లో తన 21 యేట భారత వైమానిక దళంలో (Indian Air Force) చేరి అంచెలంచెలుగా పదోన్నతులు పొంది అంతరిక్షయానం చేసే నాటికి ‘స్క్వాడ్రన్ లీడర్’ గా ఉన్నారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా ఆయన మిగ్-21 యుద్ధ విమానం నడిపారు. కేవలం 23 సంవత్సరాల లోపే ఆయన సాహసోపేతమైన అనుభవం గడించారు. అప్పట్లో భారత దేశానికి తనకంటూ స్వంత అంతరిక్ష కార్యక్రమాలు లేకపోవడంతో, సెప్టెంబర్ 20, 1982న ఆయన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), సోవియట్ యూనియన్ (రష్యా) ఇంటర్ కాస్మోస్‌లు సంయుక్తంగా నిర్వహించిన అంతరిక్ష కార్యక్రమానికి ఎంపికయ్యారు. శిక్షణలో భాగంగా అతను మాస్కోలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో రెండేళ్లపాటు కఠినమైన శిక్షణ పొందారు.

అంతేకాదు అతను బెంగుళూరులోని ఐఎఎఫ్ శిక్షణా కేంద్రంలోని ఒక గదిలో కృత్రిమ విద్యుత్ దీపాల కాంతిలో క్లాస్ట్రోఫోబియా (ఒంటరి ప్రదేశాలలో గడపడానికి భయం) పరీక్ష కోసం 72 గంటల పాటు ఒక గదిలో బందీగా ఉండాల్సి వచ్చింది. రష్యాలో శిక్షణ పొందుతున్న సమయంలో ఆయన తన భార్యతో సహా రష్యా భాష మాట్లాడడం నేర్చుకున్నారు. రోదసిలో 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు గడిపిన ఆయన కేవలం 9 గంటలు మాత్రమే నిద్రపోయారు. మిగతా సమయంలో ఆయన జీవశాస్త్రం (Life Sciences), రిమోట్ సెన్సింగ్‌కు సంబంధించి ఎన్నో పరిశోధనలు జరపడంతోపాటు అంతరిక్షంలో (గురుత్వాకర్షణ శక్తిలేని ప్రదేశం) యోగా సాధన మానవ శరీరంపై ఏమైనా ప్రభావం చూపుతుందా అన్న అంశంపై కూడా అధ్యయనం చేశారు.రాకేష్ శర్మ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సమయంలో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఉపగ్రహం ద్వారా ఆయనతో జరిపిన సంభాషణలో మీరు చేపడుతున్నది ఒక చారిత్రాత్మక ప్రయత్నం. మీ ఈ చొరవ భారత దేశానికి అంతరిక్ష శాస్త్రంలో చైతన్యం కలిగించడంతో పాటు మన యువత మరింత సాహసోపేతంగా మారేందుకు ప్రేరణగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను అని అన్నారు.

అంతరిక్షం నుండి భారత దేశం ఎలా కనిపిస్తోంది అని ఆమె అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన ప్రఖ్యాత కవి మహమ్మద్ ఇక్బాల్ వాక్యాలు ఉటంకిస్తూ సారే జహాన్ సే అచ్ఛా (యావత్ ప్రపంచం కంటే మెరుగ్గా ఉంది) అని ప్రతిస్పందించడం ప్రతి భారతీయుడి స్మృతిపథంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సాధారణంగా గగనతలం నుండి తీయడానికి రెండు సంవత్సరాలు పట్టే అద్భుతమైన చిత్రాలను, ఆయన ప్రయాణిస్తున్న అంతరిక్షనౌక భారత భూభాగం మీదుగా సంచరిస్తున్న ప్రతి సందర్భంలో తన శక్తివంతమైన కెమెరాలో బంధించారు. అంతేకాదు ఆయన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తున్న పర్వతారోహకులను కూడా తన కెమెరాలో బంధించడం విశేషం.అంతరిక్షం నుండి ప్రతి 24 గంటల సమయంలో నాలుగు నిమిషాల పాటు భారత దేశ కోస్తా ప్రాంతం స్పష్టంగా కనిపించిందని ఆయన ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతరిక్ష యాత్ర ముగించుకుని ఆయన 11 ఏప్రిల్ 1984న ఖజకిస్తాన్ లో తిరిగి భూమికి చేరుకున్నారు. 1985లో భారత ప్రభుత్వం ఆయనను అశోక చక్రతో సత్కరించగా, రష్యా ఆయనను హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ బిరుదుతో సత్కరించింది.

యేచన్ చంద్ర శేఖర్
8885050822

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News