యాదవుల కోటలో ఊపందుకున్న ఎన్నికల పోరు
ఆగ్రా: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను ఓడించి, ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వానికి పట్టం కట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మైన్‌పురీకి చెందిన కర్హాల్‌లో గురువారం ఓటర్లను అభ్యర్థించారు. ‘కర్హాల్ ఒక్క సీటు గెలువడం ఉత్తర్‌ప్రదేశ్‌లో 300 కన్నా ఎక్కువ సీట్లను గెలువడంతో సమానం” అన్నారు. “కర్హాల్‌లో తామర పువ్వు వికసిస్తే సమాజ్‌వాదీ పార్టీ రూపు లేకుండా పోతుంది. ఈ ఒక్క సీటే 300 సీట్లను గెలిచినంత కాగలదు” అన్నారు. ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్‌ల ర్యాలీకి కొన్ని కిలో మీటర్ల దూరంలోనే నిర్వహించిన ఈ ర్యాలీలో అమిత్ షా ఇలా చెప్పారు. కర్హాల్‌లో అఖిలేశ్ యాదవ్, బిజెపి అభ్యర్థి ఎస్‌పి సింగ్ బాఘేల్‌తో తలపడుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో ‘బంధుప్రీతి’ ఉందని అమిత్ షా ఆరోపించారు.
ఎస్‌పిలో ‘ఎస్’ అంటే సంపత్తి ఇకట్టా కరో(సంపదను పోగుచేసుకోండి), ‘పి’ అంటే పరివార్‌వాద్ చలావో(వంశపాలన నడిపించడం) కాగలదని అమిత్ షా అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ములాయం సింగ్ కుటుంబ సభ్యులు 45 పదవులు ఆక్రమించారని అన్నారు. “ వారు వారి కుటుంబం గురించే ఆలోచిస్తారే తప్ప, కనీసం తమ కులం గురించి కూడా పట్టించుకోరు” అన్నారు. “సబ్‌కా సాథ్, సబ్ కా వికాస్ అనే మంత్రం మేరకే తాము బాఘేల్‌ను నిలబెటామని, బాఘేల్‌ను గెలిపిస్తే వెనుకబడిన వారందరికీ వారి దామాషా ప్రకారం దక్కాల్సింది దక్కుతుంది” అన్నారు.