అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరో మూడు రోజులలో ప్రారంభంకానుంది. ఈ ఏడాది టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు ఎనిమిది జట్లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇతర మ్యాచ్‌లతో పోలిస్తే భారత, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే దాని క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. దుబాయ్ వేదికగా ఈ నెల 23న జరిగే మ్యాచ్ కోసం ఇరు దేశాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ అఘా సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నమెంట్‌లో భారత్‌ను ఓడించడం కంటే.. టోర్నమెంట్ విజేతగా నిలవడమే తమకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఎంతో సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న. ఈ టోర్నమెంట్‌లో గెలిచి లాహోర్‌లో కప్ అందుకోవాలనేదే మా లక్ష్యం మా జట్టుకు ఆ సత్తా ఉంది. ఇక భారత్‌తో మ్యాచ్ అంటే అది ప్రత్యేకమైనదే. అభిమానులకు అది చాలా పెద్ద పోరు. కానీ, ఓ క్రికెటర్‌గా అది నాకు ఇతర మ్యాచ్‌లాందే. మాకు భారత్‌తో గెలవడం కంటే.. టైటిల్ గెలవడమే ముఖ్యం’’ అని అన్నారు.