కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
పెరిగిన చలి గాలుల తీవ్రత
రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రం చలి ధాటికి గజ గజా వణుకుతోంది. ప్రజలు చలి తీవ్రతకు అల్లాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి పెరిగింది. ఓ వైపు పొగ మంచు కమ్మేస్తుండగా ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండడంతో పగలు, రాత్రీ అనే తేడా లేకుండా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత గ్రామాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. దీనికి తోడుగా మంచు కూడా పడుతుండడంతో ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రాలేకపోతున్నారు.
ఇటీవల వరుసగా ఏర్పడిన ఆల్పపీడనాల ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉదయం 9 గంటలైనా ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే వణుకుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని అటవీ ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో హైదరాబాద్ నగరం సహా పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు చలి నుంచి కాపాడుకునేందుకు స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లతో తిరుగుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీలు, నిర్మల్ 8.5 డిగ్రీలు, మెదక్ 10.8 డిగ్రీలు, నిజామాబాద్ 13.8 డిగ్రీలు, హైదరాబాద్ 17.3 డిగ్రీలు, భద్రాచలం 18.5 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 6.7 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో గరిష్ఠంగా మహబూబ్ నగర్ జిల్లాల్లో 18.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. రోజు రోజుకీ రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. రాష్ట్రంలో నాలుగు రోజులుగా మళ్లీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.దీంతో ఉదయాన్నే లేవాలంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చలికాలం ఆరంభంలోనే ఈ స్థాయిలో తీవ్రత ఉంటే ఇంకా జనవరి నెల, ఫిబ్రవరి వరకు చలితో ఎలా గడపాలని జనం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నగర శివార్లలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెల్లవారు జామున నడకకు, వ్యాయామానికి వెళ్లే వారికి, పాల వ్యాపారులు, పేపర్ బాయ్స్, మునిసిపల్ కార్మికులు చలిగాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనులు, అవసరాల రీత్యా తెల్లవారుజామున ద్విచక్ర వాహనాలపై తిరిగే వారి అవస్థలు వర్ణనాతీతం. మరో వైపు చలి తీవ్రతను తట్టుకునే దుస్తులను ధరించేందుకు జనం ఆసక్తి చూపడం వల్ల మార్కెట్లలో స్వెటర్లు, జర్కిన్లు, మంకీ క్యాప్లు, దుప్పట్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సంక్రాంతి, శివరాత్రి పండుగలు వెళ్లే వరకు చలి తీవ్రత కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.