Wednesday, January 22, 2025

చలికాలంలో వచ్చే వ్యాధులు

- Advertisement -
- Advertisement -

శీతాకాలం ప్రారంభమైంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి పిల్లల నుండి పెద్దల వరకు గజగజ వణుకుతున్నారు, చలితో ఇబ్బందిపడుతున్నారు. ఇక చలికాలంలో ప్రధానంగా స్వైన్ ఫ్లూ, న్యుమోనియా విజృంభిస్తాయి. న్యుమోనియా చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఆస్పత్రులలో రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. ముఖ్యంగా చిన్నారులపై ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉంది. రోజూ వందలాది మంది బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. 70% వైరస్‌ల వలన, 30% బాక్టీరియా ప్రభావంతో ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇవే కాకుండా ఆస్తమా, సిఒపిడి, బ్రాంకైటిస్ తదితర ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి వాతావరణ మార్పుల వల్ల మరిన్ని సమస్యలు వస్తున్నాయి. చలికాలం వచ్చిందంటే చాలు న్యూమోనియా, స్వైన్‌ఫ్లూ వంటివి విజృంభించే అవకాశాలు మెండుగా వున్నాయి. అయితే కొన్ని ముందస్తు జాగ్రత్తలతో వీటి ముప్పు తప్పించుకోవచ్చు. మనల్ని మనం రక్షించుకోవచ్చు. తీవ్రమైన చలి వల్ల న్యుమోనియా పెరుగుతుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడమే స్వైన్‌ఫ్లూ, న్యుమోనియా వ్యాధులు పెరగడానికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఆహారం, తాగే నీటి ద్వారా అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువ.

వేడిగా వున్నప్పుడే ఆహారం తీసుకోవాలి. ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటిని తాగాలి. ముఖ్యం గా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నెలలు నిండని శిశువులు, అప్పుడే పుట్టిన పిల్లలను తాకే ముందు వ్యక్తిగత శుభ్రతలను పాటించాలి. 65 ఏండ్లు పైబడితే వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. కావున వీరిలో ఏ రకమైన న్యుమోనియా వచ్చినా ప్రమాదం కలుగుతుంది. స్వైన్‌ఫ్లూ అధికంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గుంపుల్లోకి వెళ్ళకపోవడం మంచిది. తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు గాని, కర్చీఫ్‌ను గాని అడ్డం పెట్టుకోవాలి. బయటి నుండి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. మరుగుదొడ్లు వినియోగించిన తరువాత, భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్నవారు ఈ వ్యాధులకు సంబంధించిన టీకాలు తీసుకోవడం మంచిది.

తరచూ దగ్గు వస్తుంది. దగ్గేటపుడు చాతిలో నొప్పితో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శారీరకంగా బలహీనపడతారు. న్యుమో అంటే గాలి. న్యూమోన్స్ అంటే ఊపిరితిత్తులు. ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ అందుకే న్యుమోనియా లేదా న్యుమోనైటిస్ అనే పేరు వచ్చింది. ఈ వ్యాధుల వల్ల జ్వరం, చలి, ఒంటినొప్పులు ఎక్కువగా వుంటాయి. సాధారణంగా శ్వాసరేటు నిమిషానికి 12 ఉండాలి. కాని న్యుమోనియా వ్యాధిగ్రస్థుల్లో 25 నుండి 30 వరకు ఉంటుంది. ఇన్ఫెక్షన్ తర్వాత స్పందన రేటు 100/60 కన్నా తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోయి సాధారణంగా ఉండాల్సిన 98 కన్నా తక్కువ అవుతుంది. మన శరీరంలో సాధారణంగా 7- 11 వేల తెల్లరక్త కణాలుంటాయి. కాని న్యుమోనియా వ్యాధికి గురైన వ్యక్తిలో 30 వేల కణాల వరకు పెరిగిపోతుంది. గత కొంత కాలంగా 14 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉదయం 9 గం. వరకు చలి వణికిస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లలు, పెద్దలు బయటకు రాకపోవడమే మంచింది. పిల్లలకు స్కూళ్ళకు పంపే ముందు వేడిమి దుస్తులు, ఉన్ని దుస్తులు, షూ, చేతికి గ్లౌజులు ధరించేలా చూడాలి. కాచి చల్లార్చిన నీటిని, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలి. ఉదయాన్నే లేచి నడకకు వెళ్ళడం నగరాలు, పట్టణాల్లో సాధారణం. అయితే మిగతా కాలాలతో పోల్చితే శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 6 నుండి 8 గం. మధ్య పొగమంచుతో కాలుష్యం కలిసి ఉంటుంది. బాగా ఎండ వచ్చే వరకు అదే పరిస్థితి. ఉదయం పూట నడకకు వెళ్ళేవారు దీనిని పీల్చడం ద్వారా శ్వాసకోశ సమస్యల బారినపడే ప్రమాదం ఉంది.

ఈ 3 నెలలు ఉదయం 7.30 తర్వాతే నడకకు వెళ్లడం మంచిది. ముక్కు, చెవులు, ముఖం కప్పేలా మంకీ క్యాపులు ధరించడం, చేతులకు గ్లౌజులు వేసుకోవడం మంచిది. నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు, అపుడే పుట్టిన శిశువులు, అయిదేళ్ళలోపు చిన్నారులు, గర్భిణులు, అవయవ మార్పిడి చేసుకున్నవారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. అత్యంత అప్రమత్తతతో మెదలాలి. అలాగే కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి. సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే మనకు పలు రకాల సమస్యలు వస్తుంటాయి. అయితే చలికాలంలో శ్వాసకోశ సమస్యలతో పాటు జీర్ణ సమస్యలు కూడా వస్తుంటాయి.

మలబద్దకం వస్తుంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో పాటు కొందరు చలికి తట్టుకోలేకపోతుంటారు.అలాంటి వారు ఈ సీజన్‌లో ఆహార నియమాలు పాటించాలి. దీంతో చలి నుంచి బయట పడడమే కాదు, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే జీర్ణ సమస్యలు ఉండవు. చిలగడ దుంపలను ఉడికించి వాటిపై ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని అలాగే తినవచ్చు. లేదంటే కూర రూపంలోనూ తీసుకోవచ్చు. కొందరు వీటిని పచ్చిగానే తినేస్తారు. వీటిని తినడం వల్ల శరీరం వెచ్చగా కూడా ఉంటుంది. చలికాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల నుంచి దానిమ్మ మనకు రక్షణనిస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, పాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది.

ఈ సీజన్‌లో తినదగిన పండ్లలో దానిమ్మ ఒకటి. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఈ కాలంలో మనకు సంక్రమించే వ్యాధుల నుంచి కాపాడతాయి. అంతేకాకుండా ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. ఇది రక్తం పెరగడానికి దోహదపడుతుంది. కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. కండరాలు సులభంగా కదులుతాయి. బిగుసుకోవు. ప్రతి రోజూ పాలకూరను తింటుంటే సీజనల్ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో రాత్రే కాదు పగటి పూట కూడా వాతావరణం చల్లగానే ఉంటుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉండదు. అయితే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో వేడి పెరిగి శరీర ఉష్ణోగ్రత ఒకే స్థాయిల్లో ఉంటుంది. ఇలా ఉండడం మనకు ఎంతగానో మేలుచేస్తుంది.

అంతేకాదు నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఐరన్, కాల్షియం, మాంగనీస్, మెగ్నిషియం, కాపర్ వంటి పోషకాలు ఎన్నో మనకు లభిస్తాయి. ఇవి ఈ కాలంలో మనకు ఎంతగానో అవసరం అవుతాయి. నువ్వులను తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి రక్షణ లభించడంతోపాటు శరీరం వెచ్చగా ఉంటుంది. చలిని అడ్డుకోవచ్చు. విటమిన్ ఇ, బి3 వంటి పోషకాలు వేరుశెనగల్లో ఉంటాయి. అంతేకాదు మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. చర్మంలో తేమశాతాన్ని పెంచే గుణం ఉండడం వల్ల చలికాలంలో మన చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.

రోజూ గుప్పెడు వేరుశెనగలను నీటిలో నానబెట్టి తింటే మంచిది. ఆప్రికాట్స్, ఖర్జూరం, అంజీర్, కిస్మిస్, బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా, వాల్‌నట్స్ వంటి పలు రకాల ఎన్నో డ్రై ఫ్రూట్స్, నట్స్ మనకు అందుబాటులో వున్నాయి. ఇవి అన్ని కాలాల్లోనూ మనకు లభిస్తాయి. శరీరానికి కావల్సిన విటమిన్ ఎ, బి, సి, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు మనకు లభిస్తాయి. ఇవన్నీ ఈ కాలంలో మన శరీరానికి అత్యంత అవసరమైన కీలక పోషకాలు. కనుక ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరం వేడిగా కూడా ఉంటుంది. మన చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి, దగ్గిన, తుమ్మినా, టాయిలెట్‌కు వెళ్ళిన తర్వాత, పెంపుడు జంతువులను తాకినపుడు, భోజనానికి ముందు, తర్వాత, భోజనం వండే సమయంలో, పరిశుభ్రంగా సబ్బుతో గాని, డెటాల్‌తో గాని కడుక్కోవాలి. ఇది శీతాకాలం కాబట్టి ఆరోగ్యాన్ని రక్షించుకోవడం, కాపాడుకోవడం మన బాధ్యత. కావున ఈ చలి కాలంలో తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు, లేదంటే మన ప్రాణాలకు ముప్పే!

మోటె చిరంజీవి
9949194327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News