Sunday, January 19, 2025

డిసెంబర్ 4 నుంచి 22 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకూ జరుగుతాయి. మొత్తం 19 రోజుల ఈ సెషన్‌లో 15 సార్లు సభలు సమావేశం అవుతాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాల వివరాలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం విలేకరులకు తెలిపారు. నూతన పార్లమెంట్ భవనంలో జరిగే రెండో సెషన్‌గా ఇది నిలుస్తుంది. పలు లెజిస్లేటివ్ వ్యవహారాలు, ఇతర విషయాలు ఈ అమృతకాలంలో సభ్యుల నుంచి ప్రస్తావనకు వస్తాయని, సముచితమైన చర్చకు దారితీస్తాయని ఆశిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశాలలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి), సిఆర్‌పిసిల బదులు కొత్త చట్టాల రూపకల్పనకు బిల్లులు తీసుకువస్తారు. అదే విధంగా ఎవిడెన్స్ యాక్ట్‌ను కూడా ప్రవేశపెడుతారు.

ఇప్పటికే వీటికి సంబంధించిన హోం మంత్రిత్వశాఖ స్థాయీ సంఘం మూడు నివేదికలను ఆమోదించింది. ఎన్నికల ప్రధానాధికారి, ఎన్నికల కమిషనర్ల నియామకం అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది. ఇక టిఎంసి ఎంపి మహువా మొయిత్రాపై ముడుపులు ప్రశ్నల ఆరోపణలు, ఎథిక్స్ కమిటీ నివేదిక, తదుపరి చర్యల విషయం కూడా ప్రధానంగా చర్చకు రానుంది. ఇప్పుడు జరిగే సమావేశాలు ఈ ఏడాది చివరి సమావేశాలు అవుతాయి. క్రిస్మస్ సెలవు దినాలకు ముందు సెషన్ ముగుస్తుంది. ఈ సెషన్ ప్రారంభానికి ఒక్కరోజు ముందే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతాయి. సంబంధిత ఫలితాల ప్రభావం అధికార, విపక్షాలపై పడే దశలో ఈ సెషన్ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News