మన తెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్వరలో హైదరాబాద్ లో పర్యటించనున్నారు. తన సదరన్ సోజోర్న్‌లో భాగంగా ఈ నెల 4వ వారంలో ఆయన పర్యటన ఉంటుందని ప్రభుత్వానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి తాత్కాలిక షెడ్యూల్ అందింది. నాలుగు నుంచి ఐదు రోజుల పాటు రాంనాథ్ కోవింగ్ ఇక్కడి రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. దేశ ప్రథమ పౌరుడికి ఘన స్వాగతం పలికేందుకు సాధారణ పరిపాలన శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రతి ఏడు చలికాలం భారత రాష్ట్రపతి హైదరాబాద్‌ను సందర్శించి, ఇక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎట్ హోం నిర్వహించడం,. అతిథులను కలవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఐతే కోవిడ్ కారణంగా గత ఏడాది రాష్ట్రపతి సదరన్ సోజోర్న్ రద్దయింది. ఈ సారి మాత్రం డిసెంబర్ 19 నుంచి 25వ తేదీల మధ్య ప్రెసిడెంట్ రాంనాథ్ కోవింద్ హైదరాబాద్‌కు రానున్నారు.4 నుంచి 5 రోజుల పాటు ఆయన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ఈ మేరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. దీంతో రాంనాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.