Monday, December 23, 2024

వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే..

- Advertisement -
- Advertisement -

 ఉద్యోగులకు విప్రో ఇ-మెయిల్ సందేశం
 ఈ నిబంధనను పాటించని ఉద్యోగులపై చర్యలు
 కరోనా మహమ్మారి తర్వాత విధానాల్లో మార్పులు

న్యూఢిల్లీ/ న్యూయార్క్ : నవంబర్ 15 నుంచి వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని ఐటి దిగ్గజం విప్రో ఉద్యోగులకు ఇమెయిల్ పంపింది. దేశంలోని నాలుగో అతిపెద్ద ఐటి కంపెనీ విప్రో తన ఉద్యోగులందరినీ కార్యాలయానికి తిరిగి రావాలని కోరింది. కంపెనీ దీనికి హైబ్రిడ్ వర్క్ పాలసీ అని పేరు పెట్టింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా కంపెనీ రిమోట్ వర్క్ విధానం అమలు చేసింది. ఇప్పుడు చాలా కంపెనీలు ఈ విధానంలో మార్పులు తీసుకువస్తున్నాయి. ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలుస్తున్నాయి. గత వారం దేశంలోని రెండో అతిపెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ కూడా నెలలో 10 రోజులు ఆఫీసు నుండి పని చేసే విధానాన్ని అమలు చేసింది.

మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) వారానికి ఐదు రోజులు ఆఫీసు నుండి పనిని ప్రారంభించింది. మే నెల నుండి విప్రో తన ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేసేలా ప్రయత్నిస్తోంది. కంపెనీ ప్రకారం, 55 శాతం మంది ఉద్యోగులు ఈ పద్ధతిలో కార్యాలయం నుండి పనిచేస్తున్నారు. కంపెనీలో 2.44 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నిబంధనను పాటించని ఉద్యోగులపై జనవరి 7 నుంచి చర్యలు ప్రారంభిస్తామని ఈ మెయిల్‌తో కంపెనీ హెచ్చరించింది. అయితే ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు.

కానీ ఉద్యోగులు తిరిగి రాకపోవడం చాలా బృందాల నైతికతను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ఉద్యోగులు కూడా అసంతృప్తితో ఉండవచ్చు. అందువల్ల కంపెనీ తన నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. అనేక యూరోపియన్ దేశాలలో వివిధ నిబంధనల కారణంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు కంపెనీ ఉద్యోగులతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అన్ని చట్టాలను పాటిస్తూ ముందుకు సాగుతామని కంపెనీ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News