ప్రత్యర్థి సంస్థల్లోనూ పని చేస్తున్నారని గుర్తించాం: చైర్మన్ రిషల్ ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ : మూన్‌లైట్(ఏక కాలంలో రెండు సంస్థల్లో పనిచేయడం) వ్యవహారంపై ఐటి కంపెనీలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దాదాపు 300 మంది ఉద్యోగులను బుధవారం ఐటి దిగ్గజం విప్రో తొలగించింది. వీరంతా ఒకే సమయంలో ప్రత్యర్థి సంస్థలతోనూ పనిచేస్తున్నారని కంపెనీ గుర్తించింది. కంపెనీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని, వారు విప్రోలో పనిచేస్తూనే ఇతర సంస్థలతో వర్కింగ్‌లో ఉన్నారని, అందుకే వారిపై వేటు వేసినట్టు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తెలిపారు. ఇది కంపెనీలో జరిగిన మోసమని రిషద్ పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం, మూన్‌లైటింగ్‌కు సంబంధించి విప్రో కొద్ది రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. మూన్‌లైట్ అంటే ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేయడం, అయితే ప్రస్తుతం చాలా కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల ఈ చెడు సంప్రదాయం పెరిగింది. చాలా మంది ఉద్యోగులు ఈ తరహా పనులు చేస్తున్నారు. ఇప్పటికే ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ మూన్‌లైటింగ్‌పై ఉద్యోగులను తీవ్రంగా హెచ్చరించింది. ఏకకాలంలో రెండు చోట్ల పనిని అనుమతించబోమని, నిబంధనలను ఉల్లంఘిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ కంపెనీ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో ఇన్ఫోసిస్ హెచ్చరించింది. ఇన్ఫోసిస్ తన అంతర్గత మెయిల్‌లో ‘నో డబుల్ లైవ్స్’ పేరుతో ఉద్యోగుల హ్యాండ్‌బుక్, ప్రవర్తనా నియమావళిని కూడా ఇచ్చింది.
మూన్‌లైటింగ్ అంటే ఏమిటి?
ఒక ఉద్యోగి తన రెగ్యులర్ ఉద్యోగంతో పాటు ఏదైనా ఇతర కంపెనీ లేదా ప్రాజెక్ట్‌లో పనిచేసినప్పుడు దానిని సాంకేతికంగా మూన్‌లైటింగ్ అంటారు. కొందరు ఉద్యోగులు కంపెనీకి తెలియజేయకుండా మరొక సంస్థ లేదా ప్రాజెక్ట్‌లో పని చేస్తారు. దీనిని కంపెనీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. అయితే ఐటి రంగ ప్రముఖుడు, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ దీనిపై స్పందిస్తూ, ఐటి పరిశ్రమలో ప్రారంభ దశలో తక్కువ జీతాలు మూన్‌లైట్‌కి ఒక కారణమని అన్నారు. అయితే రెండు పనులకు ఆస్కారం లేదని, నిబంధనలను అతిక్రమిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ-మెయిల్స్‌లో తెలిపాయి. ఉద్యోగం నుండి కూడా తొలగిస్తామని హెచ్చరించాయి. విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తూ, ఇది మోసమని అన్నారు. టెక్ ఇండస్ట్రీలో మూన్‌లైటింగ్ పీపుల్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని ఆయన ట్వీట్ చేశారు.