విప్రో, ఇన్ఫీ, టెక్ మహీంద్రా కంపెనీలు ఫ్రెషర్లకు షాక్ః
న్యూఢిల్లీ : ఐటి కంపెనీల్లో ఇటీవల అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా మూన్‌లైట్(ఏక కాలంలో రెండు సంస్థల్లో పని చేయడం) వ్యవహారం ఐటి కంపెనీల్లో కలకలం రేపింది. కొన్ని కంపెనీలు ఇప్పటికే మూన్‌లైట్‌కు పాల్పడిన ఉద్యోగులపై వేటువేశాయి. ఇప్పుడు మూడు ఐటి కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలు ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకున్నాయని తెలుస్తోంది. ఆఫర్ లెటర్లు ఇచ్చినా మూడు నాలుగు నెలలుగా వారి జాయినింగ్‌ను కంపెనీలు వాయిదా వేస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు వందలాది మందికి ఇచ్చిన ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్ల లెటర్లను రద్దు చేశాయంటూ కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అనేక రౌండ్ల ఇంటర్వూలు, కఠిన ఎంపిక ప్రక్రియ తర్వాత విద్యార్థులకు ఈ ఆఫర్ లెటర్లు వచ్చాయని సమాచారం. కానీ ఈ వార్తలపై ఏ కంపెనీ కూడా అధికారిక ప్రకటన చేయలేదు.