Saturday, December 21, 2024

వ్యవస్థల్ని పని చేయనివ్వండి

- Advertisement -
- Advertisement -

ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీని సాధించిన తర్వాత రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేవలం రెండు వారాలే అయినందున రోజువారీ పాలనా వ్యవహారాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించడానికి మీకు మరికొంత సమయం పట్టవచ్చు. మీ మంత్రులలో చాలా మంది ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. అలాగే అధికారిక బదిలీలు, పోస్టింగులు పూర్తికాలేదు. మొదటి అసెంబ్లీ సమావేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. పదవి లో స్థిరపడేందుకు మీకు మరికొంత సమయం పడుతుందని మాకు తెలుసు. తెలంగాణలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ప్రజావాణి పేరిట ప్రజలను తరచు నేరుగా కలుసుకోవడం వంటి మీ తొలి అడుగులు ప్రజల ఆదరణ చూరగొన్నాయి. సీనియర్ జర్నలిస్టుగా మూడు దశాబ్దాల అనుభవంలో హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, మన కేబినెట్ వ్యవస్థను సమీపం నుంచి గమనించిన వ్యక్తిగా మన అధికార యంత్రాంగం లేదా వ్యవస్థలు స్వతంత్రంగా పని చేయడానికి అనుమతించాలన్నది నా భావన. మన కార్యనిర్వాహక వ్యవస్థ సమర్థవంతమైనది, అప్రమత్తంగా వ్యవహరించేది. చాలా మంది అధికారులు ప్రజలకు అండగా ఉంటారు. సామాన్య ప్రజలలో వీరి పట్ల ఉన్న భావనకు ఇది పూర్తి భిన్నమైన వాస్తవం.

చాలా సందర్భాలలో మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ ప్రతినిధులు కార్యనిర్వాహక విభాగం విధి నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తుంటారు. ఉదాహరణకు ప్రతి సంవత్సరం టీచర్లు, నర్సులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతుంటుంది. అయితే ముఖ్యమంత్రి లేదా మంత్రుల స్థాయిలో మన రాజకీయ నాయకత్వం తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికో లేక తమ వారికి ప్రయోజనాలు చేకూర్చడానికో నిధుల లేమి సాకుతో ఈ నియామక ప్రక్రియకు అవాంతరాలు సృష్టిస్తుంటారు. మీతో ఒక విషయం పంచుకోవాలి. కొణిజేటి రోశయ్య దుర్బలుడిగా లేక వేగంగా నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తిగా లేక సుపరిపాలనలో అసమర్ధుడిగా మనమంతా భావిచేవారం. కాని ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డిఎస్‌సి (డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీస్) ద్వారా టీచర్ల నియామకం జరిగింది. ఇది మీకు ఎలా సాధ్యమైందని మేము ప్రశ్నించగా.. అదో నిరంతర ప్రక్రియ. నేను చేయడానికి ఏమీ ఉండదు అని ఆయన సూటిగా జవాబిచ్చారు. పరిపాలనకు ఇదే సారాంశం. ఇతర ఉద్యోగ నియామకాలకూ ఇదే సమాధానం వర్తిస్తుంది. ఇటీవల ఇచ్చిన మీ ఇంటర్వూలలో మీరు ఇలా అన్నారు (నేను ఓ టీమ్ లీడర్‌ని, ఒక రకంగా చెప్పాలం గుంపు మేస్త్రీని). విషయపరిజ్ఞానం ఉన్న నిపుణుల చేత పని చేయించడమే నా బాధ్యత. ముఖ్యమంత్రిగా ఇదే సరైన దృక్పథం.ప్రతి విషయంలో మీ ప్రమేయం ఉండడం, మొత్తం భారాన్ని ముఖ్యమంత్రిగా మీరే మోయడం తగదు. అయితే కొందరు పిరికి లేదా అవకాశవాద అధికారులు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి తాము తీసుకోవలసిన నిర్ణయాలను సైతం ముఖ్యమంత్రికే వదిలేస్తుంటారు. ఇది వాంఛనీయం కాదు.

మన శాఖల విషయమే తీసుకోండి. వర్షాకాలం ప్రారంభానికి ముందే వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులు, ఇతర ముడి పదార్థాల కోసం ముందుగానే ప్రతిపాదనలు పంపుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం లేదా మంత్రి కార్యాలయం వద్ద జరిగే జాప్యం కారణంగా ఫైళ్లు కదలకపోవడం మనం చూస్తుంటాం. ఫైలుపై మంత్రి సంతకం చేయని కారణంగా ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ ఈవెంట్‌లో పాల్గొనేందుకు స్కాలర్ షిప్ కోసం ఎదురు చూస్తుంటాడు. మంత్రి వేరే పనులలో బిజీగా ఉన్న కారణంగా మందుల కొనుగోలుకు సంబంధించిన ఫైలు కోసం ఆరోగ్య శాఖ ఎదురు చూస్తుంటుంది. వచ్చిన ఫైళ్లను వేగంగా పరిష్కరించడానికి బదులు ఒక సాధారణ పరిపాలనా ప్రక్రియకు ముఖ్యమంత్రి కార్యాలయం లేదా మంత్రుల కార్యాలయాలు అడ్డంకులు సృష్టిస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. సమగ్ర సమాచారం లేదా వివరణ కోసం ముఖ్యమంత్రి లేదా మంత్రుల బల్లల మీద పేరుకుపోయిన వందలాది ఫైళ్లను మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి ఫైళ్లు కింది స్థాయిలోనే పరిష్కరించేలా చొరవ చూపాలి. ఉదాహరణకు ఏజెన్సీ ప్రాంతాలలో మెడికల్ అంబులెన్సుల ప్రారంభానికి సంబంధించిన ఫైలును స్థానిక అధికారులైన ఆర్‌డిఒ లేక కలెక్టర్లే పరిష్కరించేలా చూస్తే మీపైన భారం తగ్గుతుంది.

ముఖ్యమంత్రి బాహుబలి కానక్కర లేదు
ముఖ్యమంత్రి రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థకు అధిపతి. మన కేబినెట్ వ్యవస్థలో ముఖ్యమంత్రి కూడా మంత్రులలో ఒకరే. ముఖ్యమంత్రి బాహుబలి కానవసరం లేదు. గత ముఖ్యమంత్రులు కొందరు చేసిన కృషి వల్ల రాష్ట్రంలో ఏది జరిగినా దానికి ముఖ్యమంత్రే కారణమన్న భావన ప్రజలలో ఏర్పడింది. అంతా సవ్యంగా సాగుతున్నంత వరకు ఏ సమస్యా లేదు. కాని, జరగరానిది జరిగినప్పుడు మాత్రం తన బాధ్యత లేనప్పటికీ నిందను ముఖ్యమంత్రే మోయాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిని కలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. తమ పని జరిగినా జరగకున్నా ముఖ్యమంత్రిని కలసి తమ సమస్యలు చెప్పుకోవాలని ప్రజలు కోరుకుంటారు. ప్రజలను నేరుగా కలుసుకోవాలని మీరు తీసుకున్న నిర్ణయం అభినందనీయం.గతంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఢిల్లీలో ప్రజలను నేరుగా కలుసుకునే వారు. అయితే భద్రతా కారణాల రీత్యా ప్రధాన మంత్రులు ప్రజలను కలుసుకునే ఆనవాయితీ నిలిచిపోయింది. కొద్ది మంది మినహాయిస్తే మన దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, బీహార్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రిని కలుసుకోవడం అన్నది ఒక సమస్యే కాదు. అయితే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అదో సమస్యగా మారిపోయింది. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకడం దుర్లభంగా మారింది. ప్రజలను కలుసుకోవడం వల్ల సమయం వృథా అవుతుందని భావించే ముఖ్యమంత్రుల అభిప్రాయం సహేతుకమే కావచ్చు.

ప్రతి ఒక్కరినీ కలుసుకోవడం వల్ల దళారులు లేదా లాబీయిస్టులను ప్రోత్సహించినట్లవుతుందని కొందరు ముఖ్యమంత్రులు భావిస్తుంటారు. పరిపాలన సవ్యంగా సాగుతుంటే ఇక ప్రజలను ముఖ్యమంత్రులు కలుసుకోవలసిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తుంటారు. అందులో నిజం కూడా ఉండవచ్చు. అయితే ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో రాజకీయంగా ఎదురు దెబ్బ తగలవచ్చు. పైగా తాము ఇష్టపడని దళారులు లేదా లాబీయిస్టులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఆ ముఖ్యమంత్రులకు ఏర్పడవచ్చు. ఏదేమైనా ప్రజలకు అందుబాటులో లేకపోవడం అన్నది ముఖ్యమంత్రులకు నష్టం చేకూర్చే అంశమనే చెప్పాల్సి ఉంటుంది.
ఎంఎల్‌ఎ స్థాయిలోనే అవినీతి నిర్మూలన
తెలంగాణలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎస్‌ఐ నుంచి డిఎస్‌పి లేదా ఎసిపి స్థాయి వరకు ఏ పోలీసు అధికారి అయినా పోస్టింగ్ కోసం స్థానిక ఎంఎల్‌ఎ నుంచి సిఫార్సు లేఖ పొందవలసి ఉంటుంది. ఇది అంతులేని అవినీతికి దారితీస్తోంది. ఇందుకు ప్రత్యుపకారంగా ఎంఎల్‌ఎలు భారీ మొత్తంలో నగదును కోరడమే కాదు తర్వాతి కాలంలో తాము చేసే అక్రమ కార్యకలాపాలకు కూడా ఈ పోలీసు అధికారులను వాడుకుంటారు.ఈ దుష్ట సాంప్రదాయాన్ని మీరు అంతం చేయవచ్చు. స్థానిక ఎంఎల్‌ఎను మర్యాద పూర్వకంగా పోలీసు అధికారి కలుసుకోవచ్చు కాని సిఫార్సు లేఖ తీసుకోవలసిన అవసరం ఉండకూడదు.

ఇసుక, ఇతర ఖనిజాల సరఫరా విషయంలో ఇదే వర్తిస్తుంది. భవన నిర్మాణాలకు ఇసుక కేటాయింపులకు సంబంధించి ఎంఎల్‌ఎలు పాల్పడుతున్న అవినీతి చర్యలవల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రభుత్వాలకు తల నొప్పిగా మారిపోయింది. ఇసుక అమ్మకాలలో ఎంఎల్‌ఎ నుంచి సర్పంచ్ వరకు రాజకీయ నాయకుల పాత్రను తొలగించడానికి మీరు చర్యలు తీసుకోవాలి. ఒక పారదర్శక యంత్రాంగాన్ని ఆ స్థానంలో తీసుకురావాలి. ఏఏ రంగాలలో పారదర్శకత, సమర్థమైన విధానాన్ని తీసుకురావాలో ఒక సీనియర్ ఎంఎల్‌ఎగా మీకు తెలిసే ఉంటుంది. పోలీసు అధికారులు, మున్సిపల్ అధికారుల నుంచి రక్షణ కల్పిస్తామన్న పేరుతో గత అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ఎన్నికల ప్రచార సందర్భంగా వీధి దుకాణదారుల నుంచి సైతం డబ్బులు వసూలు చేసిన ఉదంతాలను మనం గమనించాం. ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తీసుకు వచ్చే ఇటువంటి చవకబారు పనులను ఆపాలని మీరు మీ ఎంఎల్‌ఎలకు చెప్పాల్సి ఉంటుంది. ఒక కళంకిత ఎంఎల్‌ఎ వల్ల అధికార పార్టీ గెలుపు అవకాశాలు దెబ్బతినే అవకాశాలు అధికం.

కమ్యూనికేషన్
మన ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరించడం ఏ ముఖ్యమంత్రికైనా అసాధ్యం. అయితే ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో ప్రజలకు వివరించడానికి వారితో సత్సంబంధాలు కలిగి ఉండడం ముఖ్యమంత్రికి అవసరం. స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో పరిపాలన, విధానాల గురించి తన ఆలోచనలను దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ముఖ్యమంత్రులకు లేఖల ద్వారా పంచుకునేవారు. దీని వల్ల ప్రభుత్వ విధానాల గురించి ముఖ్యమంత్రులకు కూడా కొంత స్పష్టత వచ్చేది. తర్వాతి కాలంలో సమాచార లోపాలు క్రమంగా పెరిగిపోయాయి. బహిరంగ సభలు లేదా మీడియా సమావేశాల ద్వారా మీరు కూడా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించవచ్చు. చేస్తున్న సాధించిన ఘనతతో పాటు సాధ్యం కాని అంశాల గురించి కూడా మీడియా ద్వారా ప్రజలకు వివరించవచ్చు. తరచు మీడియాను కలుస్తూ ఉండండి. నిజానికి దూరం పెట్టేందుకు మీడియా చెడ్డదేమీ కాదు. మీడియా ద్వారా మీరు ఎలా ప్రజలకు చేరువవుతున్నారనేదే ప్రధానం. అయితే ప్రస్తుతం ప్రజలకు సోషల్ మీడియా విశ్వసనీయ సమాచార సాధనంగా మారిపోయిన మాట వాస్తవం. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలను కూడా నిశితంగా పరిశీలించండి. మీ ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న నిజమైన భావనను మీ నిఘా వ్యవస్థ కన్నా సోషల్ మీడియానే ఇవ్వగలదు.
శుభాకాంక్షలతో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News