న్యూఢిల్లీ : టాటా గ్రూప్ త్వరలో విస్ట్రోన్ బెంగళూరు ఆధారిత ఐఫోన్ ప్లాంట్‌ను టేకోవర్ చేయనుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, యాపిల్ సరఫరాదారు విస్ట్రాన్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ ఒక ఒప్పందం దిశగా ప్రయత్నిస్తోంది. 2023 ఆగస్ట్ నాటికి ఈ డీల్ అయ్యే అవకాశముంది. టాటా గ్రూప్ టేకోవర్ తర్వాత ఇది యాపిల్ ఉత్పత్తులకు సంబంధించి భారతదేశంలో మొదటి దేశీయ ఉత్పత్తి శ్రేణిని పొందుతుంది.
నివేదిక ప్రకారం, విస్ట్రోన్ ఫ్యాక్టరీ విలువ 600 మిలియన్ డాలర్లు (రూ.4,946 కోట్లు) ఉంటుంది. ఈ డీల్ కోసం గత ఏడాది కాలంగా టాటా గ్రూప్, విస్ట్రాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. విస్ట్రాన్ ప్లాంట్ ఐఫోన్-14 మోడల్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 10,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. విస్ట్రోన్ 2008లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది, కంపెనీ అనేక పరికరాలకు మరమ్మతు సౌకర్యాలను అందించింది.
దీని తరువాత 2017లో కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించింది. యాపిల్ కోసం ఐఫోన్ ఉత్పత్తిని ప్రారంభించింది. 2024 మార్చి నాటికి యాపిల్‌కు 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లకు విస్ట్రాన్ భరోసా ఇచ్చినట్టు నివేదిక పేర్కొంది. నివేదికల ప్రకారం, యాపిల్ నిబంధనల ప్రకారం లాభాలను ఆర్జించడంలో సవాళ్ల కారణంగా విస్ట్రాన్ తన ఐఫోన్ అసెంబ్లీ ఫ్యాక్టరీని భారతదేశంలో విక్రయించాలని నిర్ణయం తీసుకుంది.