ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్నా అభ్యర్థులెవరో తేలని వైనం
గంట కొట్టడం నుంచి కాగడాల ప్రదర్శనకే పరిమితం అయిన టి టిడిపి
అటు పార్టీ టిక్కెట్లపై ఆశావహుల్లో టెన్షన్
ఎన్నికల ప్రచారాని ఇంకా సమయం ఉందంటున్న మరి కొందరు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్టు అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషల్ కష్టడీలో ఉండడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో స్థబ్దత నెలకొంది. కిందటి నెల 11 న అరెస్టు అయిన రోజు నుండి ఆయన్ని విడుదల చేసేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించడం లేదు. జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన హౌస్ కష్టడీ పిటిషన్‌ను విజయవాడలోని స్థానిక కోర్టు తిరస్కరించడంతో ఆ పార్టీ నేతల్లో మరింత ఆందోళన నెలకొంది. ఒక పక్క కేంద్ర ఎన్నికల అధికార యంత్రాంతం హైదరాబాద్‌కు వచ్చి ఎన్నికల నిర్వహణపై వాకబు చేసి వెళ్లడంతో ఐదు రాష్ట్రాల్లో రేపో మాపో నోటిఫికేషన్ ప్రకటించే ఛాన్స్ ఉందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పరిస్థితులు ఇలా ఉంటే.. టిడిపిలో మాత్రం చంద్రబాబు అరెస్టు తదనంతర పరిస్థితులపైనే ఆ పార్టీ తర్జన భర్జన పడుతోంది.
ఒక వేళ చంద్రబాబు అరెస్టు కాకుండా ఉండి ఉంటే ఈ పాటికే తెలంగాణలో టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బస్సుయాత్ర చేపట్టి అభ్యర్థులను ఎక్కడికి అక్కడే ప్రకటించి ఉండే వారని, ఒక దశలో టిడిపి బస్సు యాత్ర రెండు నెలల కిందటే ఖరారు చేసుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీ పరిస్థితులు ఇలా ఉంటే.. యువతపై దృష్టి సారించేందుకు అటు ఏపిలో నారా లోకేష్ ఇన్నాళ్లు పాదయాత్ర చేస్తు ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కాగా తండ్రి , పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండడంతో ఆయన్ను విడిపించుకునేందుకు సుప్రింకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిగేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీబాట పట్టారు. ఏది ఏమైనా తమ పార్టీ అధినేతను విడుదల చేయించుకునేందుకు టి టిడిపితో పాటు ఏపి నేతలు వివిధ రకాలుగా ఆందోళనలు చేపడుతున్నారు.
గంట కొట్టడం దగ్గర నుంచి కాగడాల ప్రదర్శన దాకా..
కాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా వివిధ పద్దతుల్లో తమ నిరసన వ్యక్తం చేస్తు వస్తున్నారు. ఒక రోజు మౌన ప్రదర్శన, మరో రోజు గంట కొట్టి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కాగడాలను వెలిగించి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తమ ఆందోళనను కంటిన్యూ చేస్తు వస్తున్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు , జైలుకు తరలింపుకు నిరసనగా నారా లోకేష్ పిలుపు మేరకు సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం జెక్ కాలనిలో శనివారం “ కాంతితో క్రాంతి ” కార్యక్రమం పేరిట క్యాండిల్ వెలిగించినిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నందమూరి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన తదితరులు పాల్గొనడం గమనార్హం.
కాగా ఎన్నికల నోటిఫికేషనే రాలేదని, ఎన్నికల ప్రచారానికి ఇంకా సమయం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుండడం విశేషం. కాగా తెలంగాణలో మేమే గెలుస్తామని బిఆర్‌ఎస్ అంటుంటే… కాదు కాదు హంగ్ వస్తుందని బిజెపి అంటోంది. అటు కాంగ్రెస్ మాత్రం ఈ సారి విజయం తమదేనని కాంగ్రెస్ ఢంకా బజాయించి చెబుతుంటే టి టిడిపి మాత్రం తమ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదలైతేనే తమ భవితవ్యం ఏంటో తేలుతుందని పేర్కొంటూండడం గమనార్హం.