Thursday, January 23, 2025

పింఛన్ పెంపుతో దివ్యాంగులకు మరింత ధీమా : మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పెరిగిన ఆసరా పింఛన్‌తో దివ్యాంగులకు గౌరవప్రదమైన, భద్రతతో కూడిన జీవనం సాగించవచ్చునని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మంత్రులు హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్‌తో ఆయన కలిసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు పింఛన్‌ను రూ. 3,016 నుంచి రూ. 4,016 కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంతో దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. పెంచిన మొత్తాన్ని ఈ నెల నుంచే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రాష్ట్రంలోని 5,11,656 మంది దివ్యాంగులకు రూ.4,016 చొప్పున నెలకు 205 కోట్ల 48 లక్షల 10 వేల 496 రూపాయలు అందనున్నాయని వెల్లడించారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2022 వరకు 28,81,222 కొత్తగా పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఎనిమిదేళ్లలో రూ. 57,777.08 కోట్లను ఆసరా పథకంలో భాగంగా పింఛన్‌గా ప్రభుత్వం అందజేసిందని గుర్తుచేశారు. సమాజంలోని బలహీన వర్గాలను, జీవనోపాధిని కోల్పోయిన వృద్ధులు సామాజిక భద్రతతో కూడిన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆర్దిక మద్దతు ఇవ్వడానికి నవంబర్ 2014లో ఆసరా పింఛను పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు. పథకంలో భాగంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, హెచ్‌ఐవి- ఎయిడ్స్ బాధితులు, నేత, గీత కార్మికులతో పాటు బీడీ కార్మికులకు మార్చి, 2015 నుంచి, ఒంటరి మహిళలకు ఏప్రిల్, 2017 నుంచి, అదే విధంగా ఫైలేరియా ప్రభావిత వ్యక్తులకు (గ్రేడ్-II & III) ఏప్రిల్, 2018 నుండి, డయాలిసిస్ బాధితులకు ఆగస్ట్ 2022 నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వాలు దివ్యాంగుల నెలకు రూ.500, వృద్ధులకు రూ.200- మాత్రమే ఇచ్చే వారని గుర్తుచేశారు. 2014 అక్టోబర్‌లో వృద్ధులకు, ఇతరులకు రూ.1000, దివ్యాంగులకు రూ.1500 గా పెంచాం. 2019 జూన్ లో వృద్ధులకు, ఇతరులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 గా పెంచి అందజేశాం. తాజాగా దివ్యాంగులకు రూ. 4016 కు పెంచారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News