న్యూఢిల్లీ: జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జిఎస్‌టిని వెంటనే ఉపసంహరించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం డిమాండు చేశారు. తమ డిమాండును కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే ఆందోళన చేపడతామని ఆమె హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై విధించిన జిఎస్‌టిని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆమె ఎక్స్ వేదికగా డిమాండు చేశారు.
ప్రజల మౌలిక అత్యవసారాలను పరిరక్షించడానికి ఉద్దేశించిన ఈ బీమాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ జిఎస్‌టి మంచిది కాదని టిఎంసి అధినేత్రి పేర్కొన్నారు. ఈ ప్రజా వ్యతిరేక జిఎస్‌టిని కేంద్ర ప్రభుత్వం వాపసు తీసుకోకపోతే తాము రోడ్లను ఎక్కవలసి వస్తుందని ఆమె హెచ్చరించారు. గతంలో రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాస్తూ జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై విధించిన 18 శాతం జిఎస్‌టిని ఉపసంహరించాలని కోరారు. సీతారామన్‌కు గడ్కరీ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.