కేంద్రాన్ని కోరిన స్టాలిన్
చెన్నై: రైతుల డిమాండ్లను అంగీకరించడం ద్వారా వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానాన్ని ఆమోదిస్తామని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తామని డిఎంకె అధినేత అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన నిరసన మే 26వ తేదీతో ఆరు నెలలు పూర్తవుతున్నప్పటికీ వివాదాస్పద చట్టాలను రద్దు చేయడానికి కాని నిర్మాణాత్మతక చర్చల ద్వారా కాని ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమని ఒక ప్రకటనలో స్టాలిన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించడం ద్వారా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్రాన్ని అర్థించారు.