Monday, January 20, 2025

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహణపర్వం బుధవారంతో ముగిసింది. దాంతో గురువారం నుంచి ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగనుంది. ప్రచార రథాలు, కార్యకర్తల నినాదాలు, నేతల ఉపన్యాసాలు, ఇంటింటి ప్రచారం, బైక్ ర్యాలీలులతో గ్రామాలు, పట్టణాలలో ఎన్నికల సందడి మొదలుకానుంది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరి వ్యూహాలు వారివే, ఎవరి ధీమా వారిదే. పోటీ పోటీగా ప్రచారాలతో ఎన్నికల ప్రచారం ఒక్కసారి ఊపందుకోనుంది. బిఆర్‌ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల ప్రకటించడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా నియోజకవర్గాలలో ప్రత్యర్థి ఎవరో తెలియక బిఆర్‌ఎస్ అభ్యర్థులే ప్రచారం నిర్వహించుకుంటున్నారు. నామినేషన్ల చివరి వరకు కూడా ప్రత్యర్థి పార్టీలలో అభ్యర్థులు ఖరారు కాలేదు.

ప్రత్యర్థులు ఎవరో తేలిపోయింది
నామినేషన్ల ఉపసంహరణ రోజు ఎన్నో ఉత్కంఠ పరిణామాలు, సంప్రదింపులు, బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగింది. ఎట్టకేలకు బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, కొంతమంది రెబల్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులకు తమ ప్రత్యర్థులు ఎవరనేది తేలిపోయింది. ఇక ఇరు వర్గాల ఎత్తులు పైఎత్తులతో ప్రచారం ఊపందుకోనుంది. ఇప్పటివరకు సాదాసీదాగా ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ గురువారం నుంచి అభ్యర్థుల మధ్య సీరియస్ వార్ ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ వరకే అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అంటే అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి కేవలం 12 రోజుల సమయం మాత్రమే ఉంది

. అందుబాటులో ఉన్న ఈ 12 రోజుల్లోనే నియోజకవర్గంలో ఉన్న మండలాలు, పట్టణాలు, గ్రామాలలో పర్యటించడంతోపాటు ప్రత్యర్థి ఎత్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పైఎత్తులు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు రాజకీయపరమైన విమర్శలతోపాటు నియోజకవర్గంలో స్థానికంగా ఉండే సమస్యలకు సంబంధించిన విమర్శలు, వ్యక్తిగతమైన విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి విమర్శలపై ధీటుగా ప్రతి విమర్శలు చేస్తూనే కేడర్‌ను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం వ్యూహాలు రచించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో 12 రోజులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సరళి ఒక్కసారి మారిపోనుంది.

సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అభ్యర్థులను సంబంధించిన ప్రచారాన్ని ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్(ట్విట్టర్),ఇన్‌స్ట్రాగ్రామ్ వంటి సోషల్ మీడియాలలో అప్‌డేట్ చేస్తూ కేడర్, కార్యకర్తలను నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు, ఆ పార్టీల నుంచి పోటీలో ఉంటున్న అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలను సోషల్ మీడియాలోనే ధీటుగా సమాధానం ఇస్తూ అంటే ధీటుగా ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అభ్యర్థులు తమ నియోజకవర్గాలవారీగా అవసరం మేరకు సోషల్ మీడియా నిర్వహణలో నైపుణ్యం కలిగిన యువకులను నియమించుకుని వారి పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచిస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా యువతకు వేగంగా సమాచారాన్ని చేరవేయగల ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రచారాన్ని వేడిక్కిస్తున్నారు. తమ పోస్టులకు లైక్‌లు, కామెంట్లు చేస్తూ షేర్ చేసేలా కార్యకర్తలను సన్నద్దం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News