తూర్పు లడఖ్‌లో పాంగాంగ్ సో సరస్సు ఉత్తర దక్షిణ తీరాల నుంచి భారత, చైనా సేనలు గత ఫిబ్రవరిలో ఉపసంహరించుకున్న తర్వాత ఈ నెల ఐదారు తేదీల్లో గోగ్రా అనే చోటు నుంచి కూడా ఉభయ సైన్యాల ఉపసంహరణ జరగడం రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి పూర్వపు స్థితికి నెమ్మదిగా చేరుకుంటున్నాయనడానికి గట్టి నిదర్శనంగా భావించాలి. 1962 నాటి యుద్ధం తర్వాత సుదీర్ఘ కాలం దాదాపు ప్రశాంతంగా ఉన్న భారత, చైనాల వాస్తవాధీన రేఖ వద్ద 2020 మే లో తిరిగి తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు వైపులా పలువురు సైనికులు మృతి చెందారు. ఆ తర్వాత అటు ఇటు సేనల మోహరింపు కూడా భారీగా జరిగింది. వాస్తవాధీన రేఖకు ఇటు వైపు అంటే సరిహద్దుల్లోని మన భూభాగంలో రోడ్లు తదితర నిర్మాణాలు చేపట్టడం తనకు కంటగింపుగా మారి చైనా మన సేనలపై దాడికి దిగింది. అయితే గత ఏడాది మే ఘర్షణల తర్వాత రెండు వైపులా గల సైన్యాధికారుల మధ్య చర్చలు మొదలు కావడం వాటి ఆ ప్రాంతాల నుంచి సేనల ఉపసంహరణ జరుగుతూ ఉండడం శుభ పరిణామంగా భావించవలసి ఉంది.
కాని, సేనల ఉపసంహరణ జరుగుతున్న తీరు మీద పలు అనుమానాలు బయల్దేరాయి. ఈ ఉపసంహరణ చర్చల్లో మనం పాల్గొనడం చైనాకు లొంగిపోడమేనని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో సమున్నత కైలాస్ రేంజ్ పర్వత సానువులను స్వాధీనం చేసుకొని భారత సేనలు సాధించిన పై చేయిని మొదటి ఉపసంహరణ ఒప్పందం ద్వారా మనం కోల్పోయామని పలువురు విమర్శకులు ఎత్తి చూపుతున్నారు. కైలాస్ రేంజ్ సానువుల నుంచి సరస్సు ఉత్తర దక్షిణ తీరాలను అదుపులో ఉంచుకోగల స్థితిని మన సైన్యాలు సంపాదించుకున్నాయని మొదటి ఉపసంహరణలో భాగంగా అక్కడి నుంచి అవి వైదొలగడం మనకు నష్టమేనని నిపుణులు ఎత్తి చూపుతున్నారు. అలాగే అక్కడి నాలుగో ఫింగర్ అని పిలిచే ప్రాంతం నుంచి ఎనిమిదో ఫింగర్ అనే ప్రాంతం వరకు చైనా సేనలు ఉపసంహరించుకోడం మంచిదే అయినప్పటికీ అంతకు ముందరి మాదిరిగా ఎనిమిదో ఫింగర్ వరకు గస్తీ తిరిగే హక్కును భారత సేనలు కోల్పోడం మనకు మరో నష్టదాయకమైన పరిణామమే.
సేనల ఉపసంహరణ జరిగేటప్పుడు యథాపూర్వ స్థితి అంటే అంతకు ముందున్న పరిస్థితి పూర్తిగా పునరుద్ధరణ కావాలి. పూర్వం జరిగినట్టు ఎనిమిదో ఫింగర్ వరకు గస్తీ తిరిగే అవకాశం మన సేనలకు లభించి ఉండాలి. అలా జరగలేదు. రెండో ఒప్పందం ప్రకారం మొన్న ఐదారు తేదీల్లో గోగ్రా నుంచి ఉపసంహరణలు జరిగినప్పటికీ అది భారత, చైనాల మధ్య చర్చల ప్రక్రియ ఆగిపోలేదనడానికి సంకేతంగా సంభవించిన మలుపే తప్ప భారత్‌కు చెప్పుకోదగిన మేలేమి కలగలేదు. పోనీ ఇంతటితో రెండు దేశాల మధ్య పూర్వపు స్థితి పునరుద్ధరణ అయిందా అంటే అది కూడా జరగలేదు. ఇంకా తూర్పు లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, దేప్సంగ్, డెమ్చోక్ వద్ద సేనల ఉపసంహరణ మిగిలే ఉంది. దేప్సంగ్ మైదానాల్లో సైనిక ఉపసంహరణకు చాలా కీలకమైనది. అక్కడ దౌలత్ బాగ్ ఓల్డీ స్థావరం దాటి 30 కి.మీ. మేర మన భూభాగంలోకి చైనా సేనలు చొచ్చుకు వచ్చి మన దళాలు గస్తీని అడ్డుకున్నాయి. ఈ ప్రాంతం నుంచి చైనా సేనలు పూర్తిగా వెనక్కు పోవాలి. 2020 మే జూన్ నెలల్లో భారత సేనల గస్తీ కింది 60 చదరపు కి.మీ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రూఢి వార్తలు వెల్లడించాయి.
2020 మే ఘర్షణల్లో భారత్ ఒక్క అంగుళం భూభాగాన్నీ కోల్పోలేదని, దురాక్రమణ జరగలేదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మాట తెలిసిందే. వాస్తవాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్టు బోధపడుతున్నది. సేనల ఉపసంహరణ చర్చలను చైనా ఏకపక్షంగా శాసిస్తున్నదనే విమర్శ కూడా బాహాటంగా వినవస్తున్నది. ఉభయ సైన్యాధికారుల మధ్య ఇప్పటి వరకు 12 సార్లు చర్చలు జరిగాయి. మిగతా ప్రాంతాల్లో సైనిక ఉపసంహరణ మీద ఇంకా అనేక సార్లు చర్చలు జరగవలసి ఉన్నట్టు బోధపడుతున్నది. 1962 యుద్ధంలో భారత భూభాగాన్ని చైనాకు అప్పనంగా ఇచ్చేశారని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మీద పదేపదే విరుచుకుపడే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం గత ఏడాది ఘర్షణల్లో మనం భూభాగాన్ని కోల్పోలేదని బయటికి ఎంతగా చెప్పుకున్నా వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉండ డం గమనించవలసిన విషయం. ప్రజల భాగస్వామ్యంతో దేశాన్ని అన్ని విధాలుగా బలోపేతం చేయడం, బృహత్తర ఆర్థిక శక్తిగా తయారు చేయడం ద్వారానే చైనాకు గట్టిగా పాఠం చెప్పగలం. ఆ దిశగా మన పాలకులు ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలి.