రష్యా తాజా నిర్ణయం
మాస్కో /కీవ్ : ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి సైన్యం ఉపసంహరిస్తున్నట్లు రష్యా తాజాగా ప్రకటించింది. భారీ స్థాయిలో బాంబుదాడులు సాగిస్తూనే సైన్యం వాపసీకి రష్యా నిర్ణయం తీసుకోవడం ఏ వ్యూహం అని ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఉద్రిక్తతల సడలింపు దిశలో చర్యలు తీసుకుంటున్నామనే సంకేతాలు వెలువరించేందుకు, ఆంక్షల బెడద తీవ్రతరం కాకుండా చేసుకునేందుకే రష్యా అధ్యక్షులు ఆకస్మికంగా సైన్యం ఉపసంహరణ నిర్ణయం తీసుకుంటున్నారని భావిస్తున్నారు. క్రైమియా నుంచి సేనలు వెనకకు వెళ్లుతున్న ఫోటోలను బుధవారం రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెలువరించింది. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి తమ సైన్యాన్ని పాక్షికంగా వెనకకు తీసుకుంటున్నామని రష్యా అధ్యక్షులు ఒక్కరోజు క్రితమే ప్రకటించారు. వెనువెంటనే ఈ ప్రక్రియ ఆరంభం అయింది. దాదాపుగా 13000 మంది రష్యా సైనికులు ఇప్పుడు ఉక్రెయిన్ తూర్పు, ఉత్తర, దక్షిణ సరిహద్దులలో ఉన్నారు. రష్యా సేనల ఉపసంహరణపై అంతర్జాతీయంగా నిశిత పరిశీలన ఆరంభం అయింది. ఏఏ దళాలను ఉపసంహరిస్తున్నారనేది తేల్చుకోవల్సి ఉంది, ఎంత బలగం వెనకకు వెళ్లుతుందనేది తేలాల్సి ఉందని, అన్ని అంశాల పరిశీలన తరువాతనే పుతిన్ నిర్ణయంపై ఫైనల్‌గా వ్యాఖ్యానించేందుకు వీలుంటుందని అమెరికా వర్గాలు స్పష్టం చేశాయి.