Monday, December 23, 2024

ఇడి లేకుంటే బిజెపినే లేదు

- Advertisement -
- Advertisement -

Without ED, there is no BJP

ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలి
బిజెపిని అధికారానికి దూరం చేయాలి
అదే కమ్యూనిస్టుల ప్రధాన లక్ష్యం
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) లేకుంటే బిజెపినే లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇడితో భయపెట్టి, బెదిరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఆ పార్టీ కూలదొస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇడి లేకుంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలే కూలిపోతాయన్నారు. ఇడి కూడా తమదాకా రాలేదనీ, వచ్చినా ఆశ్చర్యపోయేదేం లేదని చెప్పారు. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకికవాద, ప్రజాహక్కుల పరిరక్షణ జరగాలనీ, బిజెపిని అధికారానికి దూరం చేస్తేనే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1948 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 1949 జులై 11వ తేదీ వరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిషేధాన్ని విధించారనీ, ఇప్పుడు ఆయన్ని తమ సొంత మనిషి అన్నట్లు బిజెపి ప్రచారం చేసుకుంటూ చరిత్రను వక్రీకరిస్తున్నదని వివరించారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ-ముస్లిం ఘర్షణగా మార్చి, ప్రజల్లో మతోన్మాద బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 1948లో నిజాం నవాబుతో పాటు కాశ్మీర్ రాజు హరిసింగ్ కూడా తమ దేశాలను భారతదేశంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. విచిత్రంగా బిజెపి అధికారంలోకి వచ్చాక హరిసింగ్ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించారనీ, ఇక్కడి నిజాం నవాబుకు మతం ముసుగు తొడిగి ప్రజల్ని విడగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. మతోన్మాద అజెండాతో చరిత్రను పునర్లిఖితం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 1946లో ప్రారంభమై, 18 నెలలు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మూడు వేల గ్రామాలు, 16 వేల చదరపు కిలోమీటర్ల భూమి నిజాం సర్కారు నుంచి విముక్తం అయ్యి పేదలకు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని వివరించారు. హైదరాబాద్ సంస్థానాన్ని కమ్యూనిస్టులు ఆక్రమిస్తారనే భయంతో, నిజాం నవాబు ఇండియన్ యూనియన్‌లో లొంగిపోవడానికి అంగీకరిస్తేనే భారత సైన్యం ఇక్కడ వచ్చిందని చెప్పారు.

లొంగుబాటు పూర్తయ్యాక కూడా భారత సైన్యం 1951 వరకు ఇక్కడే ఉండి, భూస్వాముల్ని మళ్లీ ఇక్కడ పునఃస్థాపన చేసి వెళ్లాయని గుర్తు చేశారు. 1950 మార్చి 207 నాటికి 4,482 మంది కమ్యూనిస్టులు జైళ్లలో వుంటే, 57 మంది రజాకార్లు మాత్రమే జైళ్లలో ఉన్నారని తెలిపారు. వీరోచితమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బిజెపి ముస్లింలపై యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని అన్నారు. బిజెపిని గద్దె దింపితే, ఆయా రాష్ట్రాల్లోని అన్ని లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని చెప్పారు. ఈ నెల 25న హర్యానాలో దేవీలాల్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ర్యాలీకి వామపక్ష పార్టీలను ఆహ్వానించారనీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కూడా ఆహ్వానిస్తున్నారని తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మునుగోడులు టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్డంపై వివరణ ఇచ్చారు. తాము మద్దతు ఇస్తే, ప్రజా సమస్యల పరిష్కారంలో ఏవో అద్భుతాలు జరుగుతాయనే భ్రమలు తమకేం లేవని స్పష్టం చేశారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపినే తమకు ప్రథమ శత్రువు అనీ, దానిని ఓడించడమే తమ ముందున్న తక్షణ రాజకీయ అవసరం అని తేల్చి చెప్పారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News