హిజాబ్‌తోనే వస్తామని పట్టు
బెంగళూరు: హిజాబ్ ధరించి తాము తరగతులకు హాజరవ్వడానికి అనుమతించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు మంగళవారం కొట్టివేసిన నేపథ్యంలో ఉడుపిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందదిన ఆరుగురు ముస్లిం విద్యార్థినులు బుధవారం కళాశాలకు హాజరుకాలేదు. హిజాబ్ లేకుండా తాము తరగతులకు హాజరయ్యే ప్రసక్తి లేదని, తాము న్యాయపరంగా పోరాడతామని మంగళవారం ప్రకటించిన ఆ ముస్లిం విద్యార్థినులు తమ మాటకు కట్టుబడ్డారు. రెండవ సంవత్సరం డిగ్రీ సన్నాహక పరీక్షలు జరుగుతుండగా వారు తరగతులకు గైర్హాజరవ్వడం గమనార్హం. హిజాబ్ వివాదం తలెత్తినపుడు అల్లర్లు జరిగిన శివమొగ్గలోని కమలా నెహ్రూ కళాశాలకు చెందిన 15 మంది బాలికలు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇదే జిల్లాలో ఇటీవల బజరంగ్ దళ్ కార్యకర్త ఒకరు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. కాగా..బుధవారం హిజాబ్, బురఖా ధరించి వచ్చిన ఆ 15 మంది విద్యార్థినులను కళాశాల యాజమాన్యం లోపలకు అనుమతించలేదు. దీంతో వారు తరగతులకు హాజరుకారాదని నిర్ణయించుకున్నారు.
హిజాబ్ తమ మతపరమైన హక్కు అని, అది లేకుండా తాము కళాశాలకు వెళ్లబోమని ఒక విద్యార్థిని విలేకరులకు తెలిపారు. తమ అసైన్‌మెంట్లు సమర్పించడానికి ఇవాళ ఆఖరి రోజని, అయినప్పటికీ తమను తరగతులకు అనుమతించలేదని మరో విద్యార్థిని తెలిపారు. తమను తరగతులకు పంపాలని అర్థించినప్పటికీ కోర్టు ఉత్తర్వులను పాటించాలి కాబట్టి అనుమతించబోమని కళాశాల అధికారులు చెప్పారని ఆమె తెలిపారు. ఇందులో ప్రిన్సిపాల్ లేదా టీచర్ల తప్పేమీ లేదని, నిజానికి తమకు న్యాయం లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా&ముస్లింల ప్రాబల్యంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని భత్కల్ పట్టణంలో ఒక వర్గానికి చెందిన వ్యాపారులు బంద్ పాటించారు. కర్నాటక హైకోర్టు తీర్పుపై వారు తమ అసంతృప్తిని బంద్ రూపంలో వ్యక్తం చేశారు. కాగా&హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారి ఒత్తిడికి ప్రభుత్వం తలవొగ్గే ప్రసక్తి లేదని కర్నాటక ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వద్ధ నారాయణ స్పష్టం చేశారు.