ఐపిఎస్ ట్రైనీగా, హ్యూమన్ రైట్స్ చైర్‌పర్సన్‌గా, డిసిపిగా నటించి మోసం చేసిన ముఠా
నిజాంపేట: జల్సాలకు అలవాటు పడిన ఓ ముఠా తమను నమ్మిన వ్యక్తిని మోసం చేసి ఏకంగా రూ.11 కోట్లు దండుకున్నారు. ఒకరు డెహ్రాడూన్‌లో ఐపిఎస్ ట్రైనింగ్ చేస్తున్నట్లు పరిచయం చేసుకుంటుండగా, యువతి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం సౌత్ ఇండియా చైర్‌పర్సన్‌గా నమ్మ బలికించింది. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఎఎస్‌ఐగా విధులు నిర్వహించే మరో వ్యక్తి తాను సెంట్రల్ డిసిపిగా అవతారమెత్తాడు. ఇంకేముంది నమ్మినొన్ని నట్టేట ముంచారు. తాము చేస్తున్న మోసం తెలిసిపోయిందన్న భయంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ముఠా మోసాలు వెలుగు చూశాయి. బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు ఈ కేసు వివరాలను వెల్లడించారు.
కడప జిల్లాకు చెందిన ఉద్దానం శిరీష అలియాస్ స్మృతి సింహ (39)కి చిన్నతనంలోనే అదే ప్రాంతానికి చెందిన మోహన్‌రావు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పది సంవత్సరాల క్రితం భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. అప్పటికే విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్న అశతో ఉన్న స్మృతి సింహ మకాంను హైదరాబాద్‌కు మార్చింది. సినిమాలలో నటించాలన్న ఆశతో యాక్టింగ్‌కు సంబంధించిన కోర్సుల్లో శిక్షణ తీసుకుంది. సినిమాలు కలిసి రాకపోవడంతో బోరబండ ప్రాంతంలో 2015లో సింహ పేరిట సూపర్ మార్కెట్‌ను ప్రారంభించింది. సూపర్‌మార్కెట్‌కు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ రిపేరింగ్ చేసేందుకు వచ్చే అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిరువురికి మధ్య సన్నిహితం పెరగడంతో 2017వ సంవత్సరంలో మకాంను బాచుపల్లిలోని ఎపిఆర్ ప్రణవ్ అన్‌టిల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఓ విల్లాలోకి మారి సహజీవనం చేస్తున్నారు. అక్కడే వీరికి పక్క విల్లాలో ఉండే వీరారెడ్డితో పరిచయం ఏర్పడింది. అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి తనకు తాను డెహ్రడూన్‌లో ఐపిఎస్ ట్రైనింగ్‌లో ఉన్నట్లుగా, స్మృతి సింహ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం సౌత్ ఇండియా చైర్‌పర్సన్‌గా పరిచయం చేసుకున్నారు.
అంతే కాకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సిఐఎస్‌ఎఫ్ ఎఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్‌రెడ్డి తండ్రి రాఘవరెడ్డిని సెంట్రల్‌లో డిసిపి బాధ్యతలతో ఉన్నారని పరిచయం చేశారు. వీరితో పాటు విజయ్‌కుమార్‌రెడ్డి తన తమ్ముడు అభిలాష్‌రెడ్డి, బంధువులు రవిందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డిలను పరిచయం చేశారు. తమ తమ పనులు చేసుకుంటూనే స్వతహాగా తమకు 72 ఓల్వ ప్రైవేటు బస్సులు ఉన్నాయని, బాచుపల్లి సమీపంలో వీటి పార్కింగ్‌కు 32 ఎకరాల స్థలం కూడా ఉందని నమ్మబలికించారు. అంత కాకుండా వీరారెడ్డి అల్లుడి వివాహానికి సంబంధాలు చూస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఈ ముఠా తమ బంధువుల అమ్మాయి ప్రవళిక ఉందని నమ్మబలికించారు. ఓ యువతి ఫొటోను చూపించి ఫోన్‌లో వీరారెడ్డి కుటుంబ సభ్యులతో సింహతోనే ప్రవళికగా మాట్లాడించి మరింత దగ్గరయ్యారు. అన్ని విధాలుగా వీరారెడ్డి వీరిని నమ్మేవిధంగా చేశారు. ఇదే అదునుగా తమ అవసరాల నిమిత్తం చేబదులుగా కొంత డబ్బులు కావాలంటూ మొదట్లో 13 లక్షలతో మొదలు పెట్టి అప్పుప్పుడు మరికొంత మొత్తాన్ని తీసుకోవడం అలవాటు చేశారు. ఆ తరువాత లాక్‌డౌన్‌తో మార్కెట్ ఏం బాగోలేదని నమ్మబలికించి బస్సులు రోడ్డేకేందుకు మరింత డబ్బులు కావాలని కోరి నగదు రూపంలో మరింత కొంత బ్యాంకుల ద్వారా సుమారు రూ.11 కోట్ల వరకు కాజేశారు.
వత్తిడి పెంచడంతో ఆత్మహత్య
వీరారెడ్డి వద్ద నుంచి తీసుకున్న పెద్దమొత్తంలోని డబ్బులను పంచుకున్న ఈ ముఠా సభ్యులు జల్సాలు చేయడం మొదలుపెట్టారు. విలాసవంతమైన మూడు బిఎండబ్లు, రెండు ఫోర్డ్ కార్లతో పాటు మియాపూర్ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలో ఏకంగా ఓ విల్లాను కొనుగోలు చేశారు. వీరంతా కలిసి శంషాబాద్ ఎయిర్‌ఫోర్టు సమీపంలో నోవోటెల్ హోటల్‌లో సూట్ రూంలను నెలల తరబడి బుక్ చేసుకొని జాలీగా గడపడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వీరారెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డిని తనకు డబ్బులు ఇవ్వాలని వత్తిడి చేయడం మొదలు పెట్టాడు. అప్పటికే అనుమానం రావడంతో అతను ఎక్కడ ఉన్నాడన్న విషయంపై లైవ్ లోకేషన్‌ను షేర్ చేయాలంటూ తరుచుగా అడిగాడు. విజయ్‌కుమార్‌రెడ్డి లైవ్ లోకేషన్‌లను సైతం సోషల్ మీడియా ద్వారా సేకరించి నిలదీశాడు. దీంతో తాను చేసిన మోసం తెలిసిపోయిందని గుర్తించిన విజయ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 5న ప్రగతినగర్‌లో నివాసముండే తల్లిదండ్రుల ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు విషయమై పోలీసులు విచారిస్తుండగా ఈ నెల 12న వీరారెడ్డి పోలీసులను ఆశ్రయించి విజయ్‌కుమార్‌రెడ్డి ముఠా తను చేసిన మోసంపై ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు స్మృతి సింహ, రాఘవరెడ్డి, రణధీర్‌రెడ్డి, రామకృష్ణరెడ్డిలను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరివద్ద నుంచి రూ.50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 5 కార్లు, 07 మొబైల్‌ఫోన్‌లు, రూ. 2లక్షల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 11 డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు పలు పలు పేర్లతో ఉన్న ఆధార్‌కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులతో పాటు పలు సంస్థలకు చెందిన గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సుమారు వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదును, మియాపూర్‌లో కొనుగోలు చేసిన విల్లా వివరాలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నలుగురు నిందితులను రిమాండ్ తరలించగా మరో నిందితుడు పరారీలో ఉన్నాట్లు వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎసిపి సురేందర్‌రావు, సిఐ నర్సింహారెడ్డిలతో సిబ్బందిని డిసిపి అభినందించారు.