Tuesday, April 15, 2025

వివాహేతర సంబంధం..భర్తను హత్య చేసేందుకు 20 లక్షల సుపారీ

- Advertisement -
- Advertisement -

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించేందుకు కుట్ర పన్నిన వైనం ఇది. ఖమ్మం జిల్లా, ఖానాపురం హైవేలీ ఇన్స్‌పెక్టర్ భానుప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముదిగొండ మండలం, సువర్ణపూరం గ్రామానికి చెందనతోట ధర్మ అనే వ్యక్తి భార్యతో అదే గ్రామానికి చెందిన కొండూరి రామంజనేయులుకు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భర్తకు ఈ విషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా ప్రియురాలి భర్త అడ్డు తొలగించి అక్రమ సంబంధం కొనసాగించాలని కొండూరి రామంజనేయులు ధర్మ హత్యకు స్కెచ్ వేసాడు. ముందుగా ఖమ్మం రూరల్ మండలం, బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకట నారాయణ అనే వ్యక్తి ధర్మను హత్య చేయాలనే విషయాన్ని వివరించాడు. దాంతో వెంకట్ తన స్నేహితుడైన రౌడీషీటర్ పగాడాల విజయ్ కుమార్‌ను రామాంజనేయులుకు పరిచయం చేశాడు. హత్యకు రూ.20 లక్షలు సుపారీగా ఒప్పుకున్నారు.

అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు తీసుకొన్నారు..పథకం ప్రకారం మార్చి 12న దంసాలపురం శశి డాబా వద్ద తోట ధర్మను కిడ్నాప్ చేసిన నిందితులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రామాంజనేయులుకి వీడియో కాల్ చేసి ధర్మను చూపించి నిర్ధారించుకున్నారు. హత్య చేస్తామని మరికొంత డబ్బు చెల్లించాలని రామాంజనేయులును నిందితులు అడిగారు. దీంతో కాల్ కట్ చేసిన రామాంజనేయులు ఆ తరువాత పలుమార్లు కాల్ చేసినా స్పందించలేదు. దీంతో విసుగుచెందిన నిందుతులు బంధించిన ధర్మను బెదిరించి ఫోన్ పే ద్వారా లక్ష యాభై వేల రూపాయల నగదు, బంగారు గొలుసు తీసుకొని వదిలి పెట్టి వెళిపోయారు. బాధితుడు ధర్మ తనకు ప్రాణహాని ఉందని ఈ నెల 11న ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి టౌన్ ఎసిపి రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపిన ఖానాపురం హవేలీ పోలీసులు ఆదివారం నగరంలోని చెరుకూరి మామిడి తోటలో సమావేశం అయినట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుండి రెండు కత్తులు, ఎయిర్ గన్, రూ.90 వేల నగదు, 4 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News